మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో గొప్పగా నిలిచిపోయే సినిమాల్లో మొదటి వరుసలో ఉండే సినిమా రుద్రవీణ. అప్పటికి సుప్రీం హీరో, మాస్ హీరోగా రాణిస్తున్న చిరంజీవి తమిళ దిగ్దర్శకుడు కె.బాలచందర్ దర్శకత్వంలో ఈ క్లాసిక్ మూవీ చేశాడు. ఫైట్లు, డ్యాన్సులు అద్భుతంగా చేసే చిరంజీవిలో ఇంతటి నటన దాగుందా అని ప్రేక్షకులకు తెలిసేలా, ఆశ్చర్యపోయేలా చేసిన సినిమాగా రుద్రవీణకు ప్రత్యేక స్థానం ఉంది. కేవలం కథ, కథనంపైనే ఈ సినిమా ఉంటుంది. నేటితో ఈ సినిమా విడుదలై 32ఏళ్లు పూర్తి చేసుకుంది.

 

 

పసివాడి ప్రాణం, స్వయంకృషి, జేబుదొంగ, మంచిదొంగ వంటి మాస్ హిట్లతో.. చిరంజీవి ప్రభ వెలిగిపోతున్న రోజుల్లో 1988 మార్చి 4న ఈ సినిమా విడుదలైంది. ‘కులం కంటే మనిషి, మానవత్వమే గొప్ప’ అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది. కులమే ముఖ్యమనుకునే తండ్రి పాత్రలో జెమినీ గణేశన్, మనిషి, మానవత్వమే ముఖ్యమని నమ్మే కొడుకు పాత్రలో చిరంజీవి పోటీ పడి నటించారు. ఇళయరాజా అందించిన తొమ్మిది పాటలు సూపర్ హిట్టయ్యాయి. పాటలన్నింటినీ సిరివెన్నెల రాశారు. ఆయన సాహిత్యానికి ఉన్న పదును ఈ సినిమా ద్వారా తెలుస్తుంది. ఒక్క ఓటు తేడాతో జాతీయ అవార్డు మిస్సయ్యారు సిరివెన్నెల.

 

 

ఈ సినిమాకు నర్గీస్ దత్ జాతీయ సమైఖ్యత అవార్డు, ఉత్తమ ప్రాంతీయ చిత్రం, ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ గా జాతీయ అవార్డులు వచ్చాయి. రాష్ట్ర స్థాయిలో నాలుగు నంది అవార్డులు రాగా చిరంజీవికి స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చింది. తమిళ్ లో కమల్ హాసన్ తో బాలచందర్ రీమేక్ చేశారు. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తొలి సినిమాగా నాగబాబు ఈ సినిమా తీశారు. సినిమా ఫెయిలయినా తెలుగులో వచ్చిన మంచి సినిమాల్లో ఒకటిగా, చిరంజీవి నటనకు గీటురాయిగా రుద్రవీణ నిలిచిపోయింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: