సాధారణంగా హీరోను, దర్శకున్ని చూసి ప్రేక్షకులు సినిమా చూడటానికి వెళతారు. సినిమాలకు నిర్మాతలు ఎవరనే విషయాన్ని  ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు. కానీ దిల్ రాజు బ్యానర్ నుండి సినిమా విడుదలవుతుందంటే మాత్రం హీరో, దర్శకుడు ఎవరనే విషయాలను పట్టించుకోకుండా ప్రేక్షకులు ఆయన బ్యానర్లో వచ్చే సినిమాలపై ఆసక్తి చూపుతారు. స్టార్ ప్రొడ్యూసర్ గా తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజుకు ఉన్న గుర్తింపు అంతా ఇంతా కాదు. 
 
స్టార్ హీరోలైనా దిల్ రాజు బ్యానర్లో సినిమా అంటే చేయడానికి ఎంతో ఆసక్తి చూపిస్తారు. ఏ సినిమా ఎలా ఆడుతుందో అంచనా వేసే టాలెంట్ దిల్ రాజు సొంతం. డిస్ట్రిబ్యూటర్ గా కూడా దిల్ రాజు ఎన్నో సక్సెస్ లు అందుకున్నాడు. కానీ గత కొన్నేళ్ల నుండి దిల్ రాజు జడ్జిమెంట్ కొన్ని సందర్భాల్లో తప్పుతోంది. సినిమా విడుదలకు ముందు అంచనాలు పెరిగినా ఆయన బ్యానర్లో వస్తున్న కొన్ని సినిమాలు డిజాస్టర్ ఫలితాన్ని అందుకుంటున్నాయి. 
 
ఫ్లాపుల్లో ఉన్న హీరోలు దిల్ రాజును నమ్మి ఆయన బ్యానర్లో చేయాలని ఆసక్తి చూపుతుంటే దిల్ రాజు ఆ హీరోల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నాడు. నితిన్ హీరోగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీనివాస కళ్యాణం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని దిల్ రాజు అంచనా వేయగా సినిమా తొలి ఆటకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఫ్లాపుల్లో ఉన్న మరో హీరో రాజ్ తరుణ్ దిల్ రాజు బ్యానర్లో లవర్, ఇద్దరి లోకం ఒకటే సినిమాల్లో నటించాడు. 
 
ఈ రెండు సినిమాలు రాజ్ తరుణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్లుగా నిలిచాయి. తాజాగా దిల్ రాజు మాటలను నమ్మి 96 రీమేక్ జానులో నటించిన శర్వానంద్ ఈ సినిమాతో మరో డిజాస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. దిల్ రాజు జడ్జిమెంట్ పై రానురాను నమ్మకం పోతుందని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దిల్ రాజు మరలా నిర్మాతగా వరుస సక్సెస్ లు అందుకుంటే మాత్రమే ప్రేక్షకులు ఆయనను నమ్మే అవకాశం ఉంది. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: