ఇండస్ట్రీలో విజయం సాదించటం అంత సులభమైన విషయం కాదు. అది కూడా ఏ బ్యాక్‌ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే వారు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో హాట్‌ బ్యూటీ ఇమేజ్‌తో వరుస సినిమాలు చేస్తున్న జాక్వెలిన్‌ ఫెర్నాడెజ్‌ కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొందట. బాలీవుడ్‌ గ్లామర్‌ షోకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఈ శ్రీలంకన్‌ బ్యూటీ తన కెరీర్‌ స్టార్టింగ్‌లో ఎదురైన సంఘటనల గురించి ఇటీవల ఓ మీడియా ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

 

జాక్వెలిన్‌ దాదాపు 10 ఏళ్లుగా బాలీవుడ్‌లో కొనసాగుతోంది. ఇంత సుధీర్ఘ ప్రయాణం ఆమెకు అంత సులువుగా ఏం సాగలేదు. ఒక దశలో ఆమెను తన పేరు, ముక్కు కూడా మార్చుకోవాలని సూచించారట. ఈ విషయాలను ఆమె స్వయంగా వెల్లడించింది. ఈ సందర్భంగా జాక్వెలిన్‌ మాట్లాడుతూ `బాలీవుడ్‌ లో ఎవరైన కెరీర్‌ ప్రారంభించాలంటే రకరకాల మనస్థత్వాలున్న వ్యక్తులతో ప్రయాణించాల్సి ఉంటుంది. నేను కెరీర్‌ ప్రారంభించిన దశలో కొంత మంది నా ఐబ్రోస్‌ డార్క్‌ గా ఉండేలా చూసుకోవాలని సూచించారు. నాకు చిన్నప్పటి నుంచి నా ముక్కంటే చాలా ఇష్టం. కానీ కొందరు ఆ ముక్కును ఆపరేషన్‌ చేయించుకొని మరోలా మార్చుకోవాలని సూచించారు.

 

అంతేకాదు మరింత హాస్యస్పద విషయం ఏమిటంటే మరికొందరు నన్ను పేరు కూడా మార్చుకోవాలని సూచించారు. నేను అవకాశాల కోసం ఓ ఏజెన్సీని సంప్రదించాను. వారు జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ అనేది పూర్తి పాశ్చత్య పేరు. అలాంటి పేరుతో బాలీవుడ్‌లో ఎదగటం కష్టం అన్నారు. కానీ నేను మాత్రం పేరు మార్చుకోవద్దని నిర్ణయించుకున్నా` అని తెలిపింది.

 

ఈ పదేళ్ల సినీ ప్రయాణంలో ఈ భామ మర్డర్‌ 2, రేస్‌ 2, హౌస్‌ఫుల్‌ 2, హౌస్‌ ఫుల్‌ 3, కిక్‌ లాంటి సినిమాల్లో నటించింది. ఇటీవల ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన పాన్‌ ఇండియా సినిమా సాహోలో స్పెషల్‌ సాంగ్‌లో ఆడిపాడింది జాక్వెలిన్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: