తెలుగు, తమిళ ఇండస్ట్రీలో చిన్న కొరియోగ్రాఫర్ గా కెరీర్ ఆరంభించి అంచెలంచెలుగా ఎదిగి నటుడు, నిర్మాత, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు లారెన్స్ రాఘవ.  ఒకప్పుడు చిరంజీవి నటించిన ముఠామేస్త్రి చిత్రంలో నాలుగో వరుసలో కనిపించిన లారెన్స్ తర్వాత ఆయనకే కొరియోగ్రాఫర్ గా హిట్ చిత్రాల్లో పనిచేశారు.  స్టైల్ చిత్రంతో దర్శకుడు, నటుడిగా మంచి మార్కులు కొట్టాడు లారెన్స్.  ఆ తర్వాత ముని చిత్రంలో హర్రర్, కామెడీతో మంచి విజయం అందుకున్న తర్వాత ఈ చిత్రం సీక్వెల్ గా కాంచన, కాంచన 2, కాంచన 3 చిత్రాలు తెరకెక్కించి సూపర్ హిట్స్ అందుకున్నాడు.  అయితే లారెన్స్ రాఘవకు తల్లి, తమ్ముడు ఉన్నారు.  వీరంటే ఆయనకు ఎంతో అభిమానం, ప్రేమ. 

 

తల్లికోసం ఏకంగా ఆయన పాలరాతి విగ్రహమే చేయించాడు.  అయితే ఎప్పటి నుంచో తమ్ముడు వినోద్ (ఎల్విన్)  ని ఇండస్ట్రీ వైపు లాగాలని చూస్తున్నాడు. గతంలో తనతో పాగు కొన్ని సాంగ్స్ లో వినోద్ (ఎల్విన్) నటించాడు.  తాజాగా లారెన్స్ రాఘవ తమ్ముడు వినోద్ (ఎల్విన్) తనను గత కొంతకాలంగా వేధిస్తున్నాడంటూ వరంగల్ జిల్లాకు చెందిన దివ్య అనే జూనియర్ ఆర్టిస్ట్ ఆరోపించింది.  వినోద్ వేధింపులను తట్టుకోలేక హైదరాబాద్ వెస్ట్ మారేడ్ పల్లి పోలీసులకు తాను ఫిర్యాదు చేశానని ఆమె మీడియాకి వెల్లడించింది. ఇప్పుడు తనపై తప్పుడు కేసులు బనాయించారని ఆవేదన వ్యక్తం చేసింది. 

 

తాను ఎంత ప్రాదేయ పడ్డా తన మాట ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.  తప్పుడు కేసు పెట్టి తనను జైలుకు పంపించారని దివ్య ఆవేదన వ్యక్తం చేసింది.  లారెన్స్ తమ్ముడితో తనకు ప్రాణ భయం ఉందని చెప్పింది. వారు తనను చంపాలనుకుంటున్నారని తెలిపింది.  కొంత కాలంగా వారి మనుషులు నన్ను వెంబడిస్తున్నారని భయం వ్యక్తం చేసింది.  తనను కాపాడాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ను వేడుకుంటున్నానని చెప్పింది.  అయితే దీనిపై లారెన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: