మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా దిగ్గజ దర్శకుడు ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా మరక్కార్. ఎంతో భారీ ఖర్చుతో అత్యున్నత సాంకేతిక విలువలతో, ఎందరో భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలై ప్రేక్షకుల నుండి మంచి స్పందన రాబట్టడం జరిగింది. కీర్తిసురేశ్, కళ్యాణి ప్రియదర్శన్, ప్రణవ్‌ మోహన్‌లాల్, సీనియర్ నటుడు అర్జున్, సునీల్ శెట్టి, మంజు వారియర్, సుహాసిని, ప్రభు తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా తెలుగు  ట్రైలర్ ను కాసేపటి క్రితం మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేశారు. 

 

హిందీలో అక్షయ్ కుమార్, తమిళ్ లో సూర్య, కన్నడలో యష్, మళయాళంలో మోహన్ లాల్ ట్రైలర్ ని విడుదల చేయడం జరిగింది. భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు అదిరిపోయే యాక్షన్ సీన్స్, యుద్ధ సన్నివేశాలు, కత్తి యుద్దాలు వంటివి ట్రైలర్ లో అదిరిపోయాయి. ఒకరకంగా మన బాహుబలి రేంజ్ లో ఈ సినిమా తెరకెక్కించబడిందనే చెప్పాలి. మలయాళంలో ఇప్పటివరకు ఇంతటి భారీ యాక్షన్ సినిమా రాలేదని అంటున్నారు విశ్లేషకులు.16వ శతాబ్దానికి చెందిన కుంజాలి మరక్కార్ అనే నావికుడి జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 

 

అరేబియన్ సముద్ర సింహం అనే ఉపశీర్షికతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మోహన్ లాల్ అద్భుతమైన నటనను కనబరిచారని అంటోంది సినిమా యూనిట్. ఇక ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ తో వీక్షకాదరణతో దూసుకుపోతోంది. మళయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ అవుతున్న ఈ సినిమాని, ఉగాది పండుగ సందర్భంగా ఈ నెల 26వ తేదీన భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ చేయనుంది సినిమా యూనిట్. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పరిచిన ఈ సినిమా, రేపు రిలీజ్ తరువాత ఎంత మేర సక్సెస్ ని సాధిస్తుందో చూడాలి....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: