తెలుగు సినిమా హీరోయిన్లలో విజయశాంతి ప్రత్యేకతే వేరు. తెలుగులో హీరోయిన్ కు స్టార్ డమ్ తీసుకొచ్చిన మొదటి నటి కూడా విజయశాంతే. హీరోతో సమానమైన క్యారెక్టర్లు చేసి లేడీ సూపర్ స్టార్ అనిపించుకుంది. ఎన్నో ఉదాత్తమైన పాత్రలు చేసి హీరోయిన్ వర్షిప్ ను సాధించింది. ఎనభయ్యో దశకంలో టాప్ హీరోయిన్ గా స్టార్ హీరోల పక్కన హీరోయిన్ గా చేస్తూనే అనేక శక్తివంతమైన పాత్రలు పోషించింది. స్త్రీశక్తిని చాటే సినిమాలను హీరోయిక్ గా చేసి మహిళా చైతన్యం తీసుకొచ్చిన నటి విజయశాంతి.

 

 

ప్రతిఘటన సినిమాలో విజయశాంతి పోషించిన పాత్ర చాలా శక్తివంతమైనది. స్త్రీ తలచుకుంటే ఎంతటి కాకలు తీరిన మోనగాడినైనా ఢీ కొట్టి సమాజంలో నిలబడగలదని నిరూపించే పాత్ర చేసింది. ఆ సినిమా అప్పట్లో ఓ ప్రభంజనమే సృష్టించింది. రేపటి పౌరులు సినిమాలో విద్యార్ధులను సన్మార్గంలో పెడుతూ భావి భారత భవిష్యత్ కిశోరాలుగా తీర్చిదిద్దే టీచర్ పాత్రలో ఆమె ఒదిగిపోయింది. కర్తవ్యం సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే. ఓ రాజకీయ వ్యవస్థనే ఢీకొట్టే పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆమె పరకాయ ప్రవేశం చేసిందనే చెప్పాలి. మహిళలు తలచుకుంటే ఏదైనా సాధించగలరనే పాత్రను చేసి శెభాష్ అనిపించుకుంది. ఎందరో ఆడ పిల్లలకు, యువతులకు పోలీస్ ఆఫీసర్ కావాలనే స్ఫూర్తిని రగిలించింది. ఈ పాత్రకు జాతీయ ఉత్తమ నటి అవార్డును కూడా సాధించింది.

 

 

దాసరి దర్శకత్వంలో వచ్చిన ఒసేయ్.. రాములమ్మ పాత్రలో విజయశాంతి జీవించిందనే చెప్పాలి. గ్రామీణ యువతిగా మహిళలకు అండగా ఉండే అక్క పాత్రలో స్త్రీశక్తిని చాటింది. హీరోలకు హీరోయిన్లు ఏమాత్రం తీసిపోరు అని నిరూపించిన నటీమణుల్లో విజయశాంతి తప్ప మరెవరూ లేరు. మహిళల ఔన్నత్యాన్ని, శక్తిని చాటిన ఎన్నో పాత్రలు పోషించిన విజయశాంతి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఎంతైనా అభినందనీయురాలు.  

మరింత సమాచారం తెలుసుకోండి: