పురుషాధిక్యం ఎక్కువగా ఉంటుందని చెప్పుకునే సినిమా ఇండస్ట్రీలో మహిళలు కూడా తమ సత్తా చాటిన వారు ఉన్నారు. నటనలోకే కాకుండా టెక్నికల్ విభాగంలో కూడా పురుషులకు తాము ఏమాత్రం తక్కువ కాదు నిరూపించిన వారు ఎందరో ఉన్నారు. దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, మేకప్, ఫ్యాషన్ డిజైనింగ్.. ఇలా ప్రతి విభాగంలోనే మహిళలు రాణిస్తున్నారు. తెలుగులో ఎక్కువ సినిమాలకు దర్శకత్వం వహించి గిన్నీస్ రికార్డులకెక్కిన విజయనిర్మల తర్వాత దర్శకత్వంలో రాణిస్తున్న నందిని రెడ్డి మహిళా శక్తిని చాటుతోంది.

 

 

ఇప్పటివరకూ నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించింది నందిని రెడ్డి. 2011లో వచ్చిన అలా.. మొదలైంది సినిమా ఆమె దర్శకత్వం వహించిన మొదటి సినిమా. నానినిత్యా మీనన్ హీరో హీరోయిన్లుగా వచ్చిన ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అటుపై జబర్దస్త్, కల్యాణ వైభోగమే చిత్రాలకు దర్శకత్వం వహించింది. గత ఏడాది సమంత మెయిన్ రోల్ లో ఆమె తెరకెక్కించిన మూవీ ఓ బేబి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు తెచ్చిపెట్టింది. సమంత నటనలోని మరో కోణాన్ని ఈ సినిమా ఆవిష్కరిచింది. సినిమా తెరకెక్కించిన విధానానికి నందిని రెడ్డి విమర్శకుల ప్రశంసలు సైతం పొందింది. గతంలోనే దర్శకురాలిగా నిరూపించుకున్న నందిని రెడ్డికి ఈ సినిమా మంచి బూస్టప్ ఇచ్చింది.

 

 

మహిళలు ఏ రంగంలోనూ తీసిపోరని.. నమ్మి అవకాశాలు ఇస్తే తమ శక్తి సామర్ధ్యాలను నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నారని పలు ఇంటర్వ్యూల్లో చెప్పింది. నందిని రెడ్డిని మొదట తన టీమ్ లోకి తీసుకోవడానకి కృష్ణవంశీ వెనుకాడిన సందర్భంలో ఆమెలోని తపన, టాలెంట్ ను గుర్తించి అవకాశం ఇచ్చాడు. దర్శకురాలిగా అవకాశం పొంది సక్సెస్ అయింది. మహిళా దినోత్సవం సందర్భంగా నందిని రెడ్డి ఔత్సాహిక యువతులకు ఆదర్శమనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: