ప్రముఖ టాలీవుడ్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నట్టి కుమార్ కు చెక్ బౌన్స్ కేసులో ఏడాది జైలు శిక్ష, 6 లక్షల రూపాయల జరిమానా విధిస్తూ విజయనగరం రెండో అదనపు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ దీపదైవ కృప తీర్పునిచ్చారు. 2009లో గోపీచంద్ హీరోగా నటించిన శంఖం సినిమాను ప్రదర్శించడానికి థియేటర్ ఓనర్ తో ఒప్పందం కుదుర్చుకున్న నట్టి కుమార్ ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించటంతో కేసు నమోదైంది. 
 
ఫిర్యాదుదారుడి తరపు లాయర్ రమేష్ చెబుతున్న వివరాల ప్రకారం వైజాగ్ లో కరుణామయ ఫిల్మ్స్ పేరుతో నట్టికుమార్ డిస్ట్రిబ్యూషన్ చేసేవారు. శంఖం సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు కొనుగోలు చేసిన నట్టి కుమార్ విజయనగరంలో రాజ్యలక్ష్మీ థియేటర్ లో 14రోజుల పాటు శంఖం సినిమాను ప్రదర్శించడానికి ఆరున్నర లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ నట్టికుమార్ సినిమా విడుదలయిన ఏడు రోజుల తరువాత రాజ్యలక్ష్మీ థియేటర్ కు సినిమా ప్రదర్శన నిలిపివేశారు. 
 
ఈ విషయంలో నట్టి కుమార్, థియేటర్ యాజమాన్యం మధ్య గొడవ పెద్దది కావడంతో పెద్దలు జోక్యం చేసుకొని నట్టి కుమార్ ఐదున్నర లక్షలు థియేటర్ యాజమాన్యానికి ఇచ్చేలా ఒప్పించారు. నట్టి కుమార్ థియేటర్ యజమాని రవికుమార్ కు ఐదున్నర లక్షల రూపాయల చెక్కు ఇచ్చారు. రవికుమార్ చెక్కు బ్యాంకులో వేయగా చెక్ బౌన్స్ కావడంతో కోర్టును ఆశ్రయించారు. 
 
కేసు విచారణ అనంతరం మెజిస్ట్రేట్ నట్టి కుమార్ కు జైలు శిక్షతో పాటు జరిమానా విధించారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్న సినిమాల నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా నట్టికుమార్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. గతంలో పలు సందర్భాల్లో ప్రముఖులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి నట్టి కుమార్ వార్తల్లో నిలిచారు. గతంలో కొంతమంది టాలీవుడ్ నిర్మాతలకు నయీంతో సంబంధాలు ఉన్నాయని నట్టి ఆరోపణలు చేశారు. చెక్ బౌన్స్ కేసులో నట్టికుమార్ కు ఏడాది జైలు శిక్ష విధించడం టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: