తెలుగు సినిమా ఖ్యాతి ఎల్లలు దాటుతోందని ఈమధ్య గర్వంగా చెప్పుకుంటున్నాం. దీనిని నిజం చేస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగు సినిమాకు ఓ అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ ఫిలిం ఆర్చివ్స్ ఆఫ్ ఇండియా (nfai) తన అధికారిక ట్విట్టర్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయశాంతి నటించిన కర్తవ్యం సినిమా తెలుగు, హిందీ పోస్టర్ ను ట్వీట్ చేసింది. 1990లో విడుదలైన ఈ సినిమాకు మహిళా దినోత్సవాన దక్కిన గౌరవంగా చెప్పుకోవాలి.

 

 

మహిళల విజయాలకు గుర్తుగా, వారికి గౌరవం ఇస్తూ విజయశాంతి నటించిన కర్తవ్యం పోస్టర్ ను ఎంచుకుని ట్వీట్ చేయడం విశేషంగా చెప్పుకోవాలి. దీంతో ఈ సినిమా కీర్తి ముప్పై ఏళ్ల తర్వాత కూడా తగ్గలేదని నిరూపించింది. ఇటువంటి విశిష్టమైన రోజున ఓ తెలుగు సినిమాకు ఇటువంటి గుర్తింపు రావడం తెలుగువారికి దక్కిన గౌరవంగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో దుర్మార్గుల అంతం చూసే వైజయంతి, ఐపీఎస్ పాత్రలో విజయశాంతి జీవించింది. అప్పట్లో ఈ సినిమా అఖండ విజయం సాధించింది. ఎన్నో రికార్డులు తిరగరాసింది. కర్తవ్యంలో విజయశాంతి అద్వితీయ నటనకు జాతీయ ఉత్తమ నటి అవార్డుతో పాటు నంది, ఫిలింఫేర్ అవార్డులు కూడా వచ్చాయి.

 

 

సూర్యా మూవీస్ బ్యానర్ లో ఏఎమ్ రత్నం నిర్మించిన ఈ సినిమాకు ఎ.మోహనగాంధీ దర్శకత్వం వహించారు. 1994లో ఈ సినిమాను విజయశాంతితోనే తేజశ్వినిగా రీమేక్ చేశారు. తమిళ్ లో వైజయంతి ఐపీఎస్ గా డబ్ అయింది. రెండు భాషల్లో కూడా సినిమా సూపర్ హిట్ అయింది. దేశంలో మహిళా ప్రాధాన్యం ఉన్న సినిమాలు ఎన్నో ఉన్నాయి.. వచ్చాయి. అయినప్పటికీ.. ప్రత్యేకించి కర్తవ్యంను ఎంచుకోవటమంటే ఈ సినిమాలో మహిళల ధీరత్వం, స్ఫూర్తినిచ్చే కథాంశం ఎంత బలంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: