చిత్రసీమలో ఒకపుడు నిర్మాతలకు ఎంతో గౌరవం ఉండేది. వారు కూర్చున్నాకే మిగిలిన వారు కూర్చునేవారు. సెట్ లో వారు వస్తే చాలు లేచి నిలబడి మర్యాద ఇచ్చేవారు. పాతతరం నటులది ఒకటే మాట. నిర్మాత లేకపోతే సినిమా లేదు. ఆయన ఎక్కడ నుంచో అప్పు తెచ్చి సినిమా తీస్తాడు. ఆయన డబ్బుతోనే సినిమా మొదలువుతుంది. అందుకే సినిమాకు ఫస్ట్ మ్యాన్ ఆయన అని రెస్పెక్ట్ ఇచ్చేవారు.

 

తరువాత కాలంలో హీరోలు, దర్శకులకు గౌరవం పెరిగింది. అపుడు ముగ్గురూ ఒకరిని ఒకరు గౌరవించుకునేవారు. నిర్మాత డబ్బుకు, హీరో పనితనానికి, దర్శకుడు మేధోతనానికి విజయం దక్కేదని భావించేవారు. ఇది సమిష్టి విజయం అని కూడా గొప్పగా చెప్పుకునేవారు.  అలా ఒక కుటుంబంగా ఉండేవారు.

 

ఇక మరో తరంలోకి వచ్చేసరికి హీరో ఒక్కడే మిగిలాడు. సినిమాకు హీరో ఉంటే చాలు, హిట్టు అదే చచ్చినట్లు అవుతుందన్న దురభిప్రాయం వచ్చేసింది. ఒక‌విధంగా ఇది అహంకార ధోరణిగా మారిపోయింది. నిర్మాతకు విలువ లేదు. డైరెక్ట‌ర్ వెళ్ళి కధ చెబితే నచ్చితే ఒకే, లేకపోతే ఏళ్ళకు ఏళ్ళు తిప్పించుకుంటున్నారు.

 

ఇపుడు నడుస్తున్న యుగంలో హీరోవే సర్వస్వం. ఎవరూ ఆయన దరిదాపుల్లోకి రాలేకపోతున్నారు. మరి అంతటి ఘన‌మైన హీరోగారు ఫ్లాపులు లేకుండా ఉంటున్నారా. తానొక్కడే సినిమాను నడిపిస్తున్నాడా అంటే అదేంలేదు. అందమైన హీరోయిన్లు ఉండాలి, నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ ఉండాలి. అధ్బుతమైన లోకేషన్లు ఉండాలి. కాస్ట్ లీ ప్రొడ్యూసర్ కూడా కావాలి.

 

మంచి ధియేటర్లు ఉండాలి, పూర్తిగా సెలవులు, లేదా పండుగలు ఉండాలి, మరో హీరో సినిమా పోటీగా రాకుండా తొక్కేయాలి. అన్నీ కుదిరితే అపుడు ఆ సినిమా హిట్. అటువంటి బలహీనమైన హీరో మిగిలిన టెక్నీషియన్లను చులకనగా చూస్తున్న దారుణమైన పరిస్థితి టాలీవుడ్లో సాగుతోంది.

 

వరసగా హిట్లు ఇస్తేనే డైరెక్టర్ కి మరో సినిమా వస్తోంది. కధను నమ్మడం లేదు. ఆయన సక్సెస్ ని నమ్ముతున్నారు హీరోలు. దాంతో హీరోల వెంట తిరిగి వేసారి  కాలాన్ని కాల్చుకున్న డైరెక్టర్లు ఎంతో మంది ఉన్నారు ఈనాటి  టాలీవుడ్లో. ఇలాగే నాటి తరం హీరోలు  అనుకుంటే ఒక దాసరి నారాయణరావు, ఓ రాఘవేంద్రరావు, ఓ విశ్వనాధ్, ఓ బాపూ వంటి వారు కనిపించేవారా అన్న ప్రశ్న వస్తోంది. మరి నేటి హీరోలకు హిట్లు తప్ప మరేమీ కనిపించడంలేదు. ఒక సినిమా హిట్ ని మాత్రం తాము తీసుకుంటే  ఫ్లాప్స్ ని డైరెక్ట‌ర్లు హీరోయిన్ల మీద రుద్దుతున్న పెడ ధోరణిలో  అసలు ఈ విచిత్ర సీమ మనుగడ మీదనే పెద్ద డౌట్లు వస్తున్నాయట.

మరింత సమాచారం తెలుసుకోండి: