ప్రముఖ గాయకుడు, బిగ్ బాస్ సీజన్ -3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌ ప్రేక్షకుల మదిలో తనదైన ముద్ర వేసుకున్నాడు. ఇటీవల పబ్ లో రాహుల్, తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తమ్ముడు రితేశ్ రెడ్డికి మధ్య వివాదం నెలకొంది. అది కాస్త మాటామాటా పెరగడంతో చివరకు దాడికి దారి తీసింది. 

 

రితేష్ రెడ్డితోపాటు ఆయన అనుచరులు బీరు బాటిళ్లతో రాహుల్‌పై దాడి చేశారు. ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. పబ్‌లో లభించిన సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా రితేశ్‌ రెడ్డితో పాటు మరో ఆరుగురుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ రాహుల్‌కు మద్దతుగా నిలిచారు. 

 

పబ్‌కు వెళ్లడం ఎవ్వరూ తప్పని చెప్పరు. కానీ, అలా బాటిళ్లతో కొట్టడం తప్పు. చంపేస్తారా ఏంటి? ఆ అహంకారం తప్పు. అసలు ఎవరిది తప్పో తెలుసుకుని భవిష్యత్తులో కూడా దీని గురించి మాట్లాడతాను. రాహుల్‌కు వెనుక నేను నిలబతాను. అతనికి ఒక ధైర్యం ఇస్తాన్నాను అంతే. రాహుల్ తప్పుచేయలేదని నాకు తెలుసు. సినిమా ఇండస్ట్రీకి చెందిన పాపులర్ పర్సన్స్‌ని ఎక్కడికిబడితే అక్కడికి వచ్చి కొట్టేస్తారా ఏంటి? ఒక్కడిని పట్టుకుని పది మంది బాటిళ్లతో కొట్టేయడమేంటి? దాన్ని చూస్తూ నిలుచోవడం తప్పు కదా’’ అని ప్రకాష్ రాజ్ అన్నారు.

 

ప్రకాష్ రాజ్, రాహుల్ సిప్లిగంజ్ ప్రస్తుతం ‘రంగమార్తాండ’ సినిమాలో చేస్తున్నారు. ఈ సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్నారు. మరాఠీ సినిమా ‘నటసామ్రాట్’కు ఇది రీమేక్. రమ్యకృష్ణ, ప్రకాష్‌ రాజ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంలో సీనియర్ హాస్యనటుడు బ్రహ్మానందం మరో కీలక పాత్ర పోషించారు. అలాగే రాహుల్ సిప్లిగంజ్‌తో పాటు మరో బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ అలీ రెజా కూడా ఈ చిత్రంలో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: