ఖుష్బూ.. దక్షిణ భారతదేశంలో ఈపేరు తెలియని సినీ అభిమాని ఉండడేమో. తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం ఇలా దక్షిణ భారత దేశ భాషల్లోనే కాదు.. ఉత్తరాదిన కూడా హీరోయిన్ గా రాణించిన నటీమణి ఖుష్బూ.. ఇక తమిళనాట హీరోయిన్లకు గుడి కట్టే సంప్రదాయం ఖుష్బూతోనే మొదలైంది. అంతగా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టారామె.

ఇండస్ట్రీకి వచ్చి 40 ఏళ్లయినా ఇంకా ఆమె తెరపై తన ప్రాధాన్యత కోల్పోలేదు.

 

ఆమె ఈ రోజు తమ 20వ పెళ్లిరోజును జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా నెటిజన్లు, పలువురు సినీ ప్రముఖులు వీరిని శుభాకాంక్షలు చెప్పారు. ఇక ఖుష్బు తన భర్తకు స్వీట్‌ విషెస్‌ చెప్పారు. పెళ్లి నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. పెళ్లి రోజున సుందర్‌ చాలా ఆలస్యంగా మండపానికి వచ్చారని గుర్తు చేసుకున్నారు. ‘కష్టసుఖాల్లో, మంచిచెడుల్లో, జయాపజయాల్లో ఒకరితో ఒకరు ఉన్నాం. ప్రేమతో ఓ ఇంటిని, కుటుంబాన్ని నిర్మించుకున్నాం. నువ్వు, నేను ఎప్పటికీ ఒక్కటే’.. అంటూ స్పందించారు.

 

 

కుష్బూ- సి. సుందర్ ల ప్రేమ గురించి చెప్పాలంటే.. అప్పట్లో కుష్బూ టాప్ హీరోయిన్ అయితే.. సి.సుందర్ ఓ ఫ్లాప్ డైరెక్టర్. మరి కుష్బూకు సుందర్ ఎలా ప్రపోజ్ చేశాడో తెలుసా.. సుందర్‌ ఓ కథ చెప్పడానికి వచ్చి ఆమెకు లవ్‌ ప్రపోజ్‌ చేశారట. మొదట కుష్బూను హీరోయిన్‌గా తీసుకుందామన్న ఆలోచన సుందర్ కు లేదు. అంతకు ముందు కుష్బూ, జయరాం కలిసి ఒక సినిమాలో నటించడంతో వారి కెమిస్ట్రీ అయితే బాగుంటుందని నిర్మాత సూచించారు. దీంతో సుందర్ కుష్బూకు కథ చెప్పారు.

 

కుష్బూ.. నేను డేట్స్‌ కొంచెం అడ్జెస్ట్‌ చేసుకోవాలి’ అని చెప్పిదట. సుందర్ నిర్మాత దగ్గరకు వెళ్లి ‘డేట్స్‌ ఇచ్చే వరకూ అడ్వాన్స్‌ ఇవ్వొద్దు’ అన్నారుట. అయినా నిర్మాత కుష్బూకు డబ్బులు ఇవ్వడంతో ఆయనపై సుందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత షూటింగ్‌కు వెళ్లారట. సెట్‌లో కుష్బూ, డైరెక్టర్‌, కెమెరామెన్‌, జయరాం అంతా ఒక వయసు వాళ్లే. సరదాగా ఉండేవాళ్లంట. అప్పుడే సుందర్ ఖుష్బూను ఇష్టపడటం మొదలు పెట్టారు.

 

ఆ తర్వాత కుష్బూ దగ్గరకు వచ్చి, ‘మీకో మంచి సబ్జెక్ట్‌ చెబుతా’ అని అంటే రమ్మని చెప్పిందట కుష్బూ. ఇంటర్వెల్‌ వరకూ చెప్పి, ‘మిగిలింది రేపు చెబుతా’ అని వెళ్లిపోయారు. మరుసటి రోజు వచ్చి, మళ్లీ మొదటి నుంచి చెప్పడం మొదలు పెట్టారు. అదేమంటే ‘కొత్తగా కొన్ని సీన్లు యాడ్‌ చేశా’ అనేవారు. ఎందుకంటే ఆయనకు కూడా సెకండాఫ్‌ ఏంటో తెలియదు.

 

కేవలం కుష్బూను చూడటానికే అలా వచ్చేవారు. మూడో రోజు కూడా వచ్చారు. ఇంటి టెర్రస్‌పై కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే.. ‘రేపు మనకు పిల్లలు పుడితే.. నీలాగా ఉంటారా? లేక నాలా ఉంటారా’ అని సుందర్ అన్నారట. ఒక్క క్షణం కుష్బూకు ఏమీ అర్థం కాలేదట. అప్పుడే ‘నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా’ అన్నారట సుందర్. కుష్బూ కూడా కాదనలేకపోయిందట. అలా అప్పటి స్టార్ హీరోయిన్ ఫ్లాప్ డైరెక్టర్ తో ప్రేమలో పడింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: