అన్న మెగాస్టార్ చిరంజీవి అడుగు జాడల్లో రాజకీయాల్లో అడుగుపెట్టిన హీరో పవర్‌ స్టార్ పవన్‌ కళ్యాణ్‌. చిరంజీవి కన్నా ముందే కామన్‌ మేన్‌ ప్రొటక్షన్ ఫోర్స్‌ పేరుతో ఓ సేవ సంస్థను స్థాపించిన పవన్‌ తరువాత దాని ఊసే మరిచిపోయాడు. ఇక ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా తన ఉపన్యాసాలతో ప్రజలను ఉర్రూతలూగించాడు. అదే సమయంలో పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పార్టీనికి నష్టం కూడ చేశాడు. అయితే ప్రజారాజ్యం పార్టీ ఎన్నికల్లో ఘోరంగా విఫలమవ్వటంతో పవన్ కొంత కాలం రాజకీయాలకు దూరమయ్యాడు.

 

తరువాత సొంతంగా జనసేన పార్టీని స్థాపించిన పవన్‌ 2014 ఎన్నికల్లో పోటి మాత్రం చేయలేదు. టీడీపీ, బీజేపీలకు మద్దతు పలికిన పవన్‌, తన బలంతోనే ఆ రెండు పార్టీలు అధికారాన్ని చేపట్టాయన్న భ్రమలో ఐదేళ్లు గడిపేశాడు. అయితే ఆ ఐదేళ్ల కాలంలో పవన్‌.. టీడీపీ, బీజేపీ పార్టీలకు దూరమయ్యాడు. దీంతో 2019 ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి పోటి చేసిన పవన్‌ ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. దీంతో పవన్‌ రాజకీయ భవిష్యత్తు ప్రశార్థకంగా మారింది. కొంత కాలం టీడీపీ అనుకూలంగా, మరి కొంత బీజేపీ అనుకూలంగా వ్యవహరించిన పవన్‌ ఫైనల్‌గా బీజేపీ పంచన చేరాడు.

 

అయితే రాజకీయాల్లో ఆశించిన స్థాయి ఫలితాలు సాధించలేకపోయిన పవన్‌ తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే బాలీవుడ్‌ సూపర్‌ హిట్ సినిమా పింక్‌ను తెలుగులో వకీల్ సాబ్‌ పేరుతో రీమేక్‌ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయ్యింది. మరికొన్ని సినిమాలకు కమిట్‌ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే రాజకీయాల్తో పాటు సినిమాల్లోనూ నటిస్తూ రెండు పడవల ప్రయాణం చేస్తున్నాడు పవన్‌, స్థానిక ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటికి దిగుతున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో ఏ మాత్రం పట్టులేని బీజేపీతో కలిసి ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయిన పవన్‌ ఎలా ముందుకు వెళతాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: