ఎన్టీఆర్‌ తెలుగు తెరను శాసించిన పేరు. తెలుగు ప్రజల గుండెల్లో ఆరాధ్య దైవంగా వెలుగొందిన పేరు. జానపదాలైనా, సాంఘీకాలైనా, పౌరాణికాలైనా తెర మీద ఎన్టీవోడు కనిపిస్తే చాలు ప్రజలు మైరచిపోయేవారు. ఆయనకు నిరాజనాలు పట్టేవారు. ఇక ఎన్టీఆర్‌ను శ్రీ కృష్ణుడిగా తెర మీద చూసి థియేటర్లలోనే హారతులు ఇచ్చిన ప్రేక్షకులు కూడా ఎంతో మంది ఉన్నారు. ఒకప్పుడు తిరుమల వేంకటేశ్వరుని దర్శనానికి వెళ్లిన భక్తులు అటు నుంచి అటు ఎన్టీఆర్‌ను కూడా చూసి రావటం అన్నది ఓ సాంప్రదాయంగా కొనసాగింది.

 

తన మీద ప్రజల్లో ఉన్న అభిమానమే పెట్టుపడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు ఎన్టీఆర్‌. 1983లో తెలుగు ప్రజల ఆశాజ్యోతిగా తెలుగుదేశం పార్టీని స్థాపించాడు. కేవలం 9 నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేసిన ఎన్టీఆర్‌, దశాబ్దాల కాంగ్రెస్‌ పాలనకు స్వస్తి పలికి అధికార పీఠాన్ని దక్కించుకున్నాడు. ఎన్టీఆర్‌ విజయానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. తెర మీద భగవంతుడిగా ఎన్టీఆర్‌కు ఉన్న ఇమేజ్‌తో ప్రజలు రాజకీయాల్లో కూడా ఆయన్ను దేవుడిగానే చూశారు.

 

అందుకే వేళ్లూనుకుపోయిన కాంగ్రెస్‌ పార్టీని మట్టి కరిపించి మరీ ఎన్టీఆర్‌కు అధికారాన్ని కట్టబెట్టారు. దశాబ్దాలు పాటు ప్రత్యర్థి అంటే లేని కాంగ్రెస్‌ పార్టీనితో విసిగిపోయిన ప్రజలు ప్రత్యామ్నాయాన్ని కోరుకున్నారు. అదే సమయంలో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావటం, సినిమా తరహా ప్రచార శైలితో రాజకీయాల్లో కొత్త ఒరవడి తీసుకురావటం లాంటి అంశాలు ఎన్టీఆర్‌కు కలిసొచ్చాయి. అదే సమయంలో సాంఘిక చిత్రాల్లో ఆయన చేసిన కొన్ని పాత్రలు కూడా ఎన్టీఆర్‌కు రాజకీయాల్లో తోడ్పడ్డాయి. ఇలా అన్ని కలిసి కేవలం పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికార పీఠాన్ని చేజిక్కించుకొని కొత్త చరిత్ర సృష్టించాడు తారక రాముడు. ఎన్టీఆర్‌ను ఇన్సిపిరేషన్‌గా తీసుకొని తరువాత చాలా మంది రాజకీయా నాయకులు రాజకీయాల్లోకి వచ్చినా ఆయన స్థాయిలో విజయం మాత్రం సాధించలేకపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: