దివంగత మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు సినిమా రంగంలో ఎన్ని సంచలనాలు క్రియేట్ చేశారు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమా రంగంలో రారాజుగా వెలుగొందిన ఎన్టీఆర్ నాటి కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ ఢిల్లీ నడివీధుల్లో నలిగిపోతున్న తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆయన రాజకీయ చరిత్రలో మొత్తం మూడుసార్లు ముఖ్యమంత్రిగా విజయం సాధించారు. 1983లో ఎన్టీఆర్ తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. భాస్కర రావు చేసిన రాజకీయ కుట్రలో ఆయన పదవి నుంచి వచ్చింది. ఆ తర్వాత 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికలలో రికార్డు స్థాయిలో విజయం సాధించిన ఎన్టీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక ఎన్టీఆర్ చనిపోవడానికి ముందు జరిగిన 1994 ఎన్నికల్లో ఆయన బంపర్ మెజారిటీతో విజయం సాధించి మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు.

 

 మొత్తం నాలుగు ఎన్నికలు ఎదుర్కొన్న ఎన్టీఆర్ ఒక్క 1989 ఎన్నికల్లో మాత్రమే ఓడిపోయారు. వివిధ నియోజకవర్గాల్లో తొమ్మిది చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన ఎనిమిది చోట్ల విజయం సాధించి ఒకే ఒక చోట మాత్రం ఓడిపోయారు. తెలంగాణలోని మహబూబ్ న‌గర్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం నుంచి 1989 లో పోటీ చేసిన ఎన్టీఆర్ చిత్తరంజన్ దాస్ చేతిలో ఓటమి పాలయ్యారు. 1989లో రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ వ్యతిరేక గాలులు బలంగా ఈ ఎన్నికల్లో వంగవీటి రంగా హత్య ప్రభావం బాగా కనపడింది. తెలుగుదేశం పార్టీకి చాలా సామాజిక వర్గాలు చిరకాలం దూరం అయ్యే పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి.

 

ఈ క్రమంలోనే 1989లో జరిగిన ఎన్నికల్లో ఎన్టీఆర్ అనంతపురం జిల్లాలోని హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం తో పాటు కల్వకుర్తి నుంచి కూడా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కల్వకుర్తి ఓటర్లు ఎన్టీఆర్‌ను నాలుగు వేల ఓట్ల తేడాతో ఓడించారు. ఎన్టీఆర్ చరిత్రలో ఈ ఓటమి అలా పోయింది. తెలంగాణలోని నల్లగొండ నుంచి అంతకుముందు ఎమ్మెల్యేగా గెలిచిన ఎన్టీఆర్ కల్వకుర్తిలో మాత్రం ఓటమి పాలయ్యే తన కెరీర్లో ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: