జే జయలలిత... బహుశా భారతీయ సినిమాలో, భారత రాజకీయాల్లో పెద్దగా ఈ పేరు తెలియని వారు ఉండరు అనేది వాస్తవం. దేశ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. సినిమాల్లో అగ్ర తారగా ఎందరో స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఆమె రాజకీయాల్లో ఎందరో ఉద్దండులతో తలపడ్డారు. కరుణానిధి ఫ్యామిలీ కి ఎదురొడ్డి నిలిచారు. ఒక మహిళ లక్ష్యంగా కరుణానిధి కుటుంబం మొత్తం ఎన్ని వ్యూహాలు రచించినా ఆమె మాత్రం రాజకీయాల్లో నిలబడ్డారు. తన సామర్ధ్యాన్ని ఆమె నిరూపించుకున్నారు. 

 

1982 లో అన్నాడిఎంకె పార్టీలో చేరిన ఆమె తక్కువ కాలంలోనే అక్కడ కీలక నేతగా ఎదిగారు. 1984 లో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. 1989 లో బోడినాయకనూరు నుండి మొట్టమొదటి సారిగా ఎం.ఎల్.ఏగా గెలిచారు. 1991 లో గాంగేయం మరియు బర్గూరు నుండి గెలిచి తొలి సారి తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. కర్ణాటకలో పుట్టినా సరే ఆమె తమిళ ప్రజలకు అమ్మ అయ్యారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టిన జయలలిత.. అక్కడి ప్రజలకు మరింత దగ్గరయ్యారు. 

 

1991లో రాజీవ్ గాంధీ మరణానంతరం జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. తొలి తమిళనాడు మహిళా ముఖ్యమంత్రిగా అవతరించారు. ముఖ్యంగా కరుణానిధి ని ఆమె ఎదుర్కొన్న విధానం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. తనకు నచ్చకపోతే ఎంతటి వారిని అయినా సరే ఆమె పార్టీలో ఉంచే వారు కాదు. అనామకులకు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి వారిని శాసన సభకు పంపించారు. మంత్రులను చేసి సంచలనం సృష్టించారు. 11 సార్లు ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తమిళనాడు రాజకీయాలు అంటే జయలితకు ముందు జయలలిత తర్వాత అనే విధంగా ఉంటాయి. ఆ విధంగా ఆమె తమిళ రాజకీయాలను శాసించారు. 2016 లో ఆమె అనారోగ్యం కారణంగా మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: