ఎన్టీఆర్.. ఈ మూడక్షరాల తారక మంత్రం.. తెలుగు నేలను కొన్ని దశాబ్దాల పాటు మైమరపించింది. ఈ తారక మంత్రం తారా నగరిలో ఆంధ్రా ప్రేక్షక లోకాన్ని విహరింప చేసింది.. ఈ తారక మంత్రం.. ప్రేక్షకులను దశాబ్దాల పాటు ఆనందడోలికల్లో తేల్చింది. ఈ తారక మంత్రం.. అంధకారంలో మగ్గిపోతున్న రాజకీయ చైతన్యం లేక కునారిల్లుతున్న తెలుగు నేలకు నవ రాజకీయాన్ని నూరిపోసింది.

 

 

40 ఏళ్లకు పైగా చిత్రసీమను ఏకచ్చత్రాధిపత్యంగా ఏలిన ఎన్టీఆర్.. ఆరు పదుల లేటు వయస్సులో రాజకీయాల్లో ప్రవేశించి అక్కడా సంచలనం సృష్టించారు. రాజకీయాన్ని సామాన్యుడికి చేరువ చేసి.. ప్రజాకర్షక, ప్రజోపయోగ పథకాలతో పేదల మనసుల్లో నిలిచిపోయాడు. ఆయన స్థాపించిన తెలుగుదేశం.. ఏకంగా ఒక దశలో పార్లమెంటులోనే ప్రధాన ప్రతిపక్షంగా అవతరించి చరిత్ర సృష్టించింది.

 

 

కానీ ఆయన బతికుండగానే ఆయన్ను కూలదోసి.. వెన్నుపోటు పొడిచి ఆయన స్థానాన్ని అల్లుడు చంద్రబాబు లాగేసుకున్నాడని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. ఎన్టీఆర్ హయాంలో ప్రజా పార్టీగా ఉన్న తెలుగు దేశాన్ని చంద్రబాబు కొత్త పుంతలు తొక్కించినా.. అదే సమయంలో రాజకీయాల్లోకి వ్యాపారవేత్తలను తీసుకొచ్చి అదో ఖరీదైన వ్యాసంగంగా మార్చేశారు. ఎన్టీఆర్ తర్వాత ఏనాడూ సొంతంగా అధికారం చేపట్టలేని దుస్థితికి తెలుగుదేశాన్ని చంద్రబాబు తెచ్చాడన్న అపవాదు ఉంది.

 

 

చంద్రబాబు ఏకపక్షవైఖరి కారణంగానే... కేసీఆర్ సొంత కుంపటి పెట్టుకుని.. ఏకంగా రాష్ట్రాన్నే విడదీయగలిగాడని చెబుతారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత టీడీపీ పరిస్థితి కేవలం ఒక్క రాష్ట్రానికే పరిమితమైంది. చంద్రబాబు చాణక్యం వైఫల్యం కారణంగా జగన్ అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. మరోవైపు అసమర్థుడైన కొడుకు కోసం చంద్రబాబు పార్టీని పణంగా పెట్టాడన్న విమర్శలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం భవితవ్యం అగమ్య గోచరంగా మారింది. ఇక తెలుగు దేశానికి నందమూరి వారసుడైన జూనియర్ ఎన్టీఆరే దిక్కు అని నందమూరి అభిమానులు భావిస్తున్నారు. మరి భవిష్యత్తులో ఏం జరుగుతందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: