సినిమాలో హీరోకు సరిసమానంగా విలన్ ను ఎంపిక చేయడం దర్శకులకు కత్తి మీద సాము అనే చెప్పాలి. హీరో బాడీ లాంగ్వేజ్ కు తగ్గ విలన్ ఉంటే ఆయా సీన్లు, ఫైట్లు అంత నేచురల్ గా అనిపించి ఆడియన్స్ ను ఆకట్టుకుంటాయి. హీరో ముందు విలన్లు, విలన్ ముందు తేలిపోయిన సినిమాలు మన తెలుగులో ఉన్నాయి. అందుకే స్టార్ హీరోలకు తగ్గ విలన్లను జాగ్రత్తగా ఎంపిక చేస్తారు. సుకుమార్ దర్శకత్వంలో బన్నీ హీరోగా వస్తున్న సినిమాలో విలన్లను అలాగే ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి.

 

 

అల.. వైకుంఠపురములో సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో బన్నీసినిమా చేస్తున్నాడు. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో కథ ఉంటుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. బన్నీ కూడా క్యారెక్టర్ కోసం ఇప్పటికే తన లుక్ మారుస్తున్నాడు. కథానుసారం రఫ్ గా, రగ్గడ్ గా కనిపించడానికి కసరత్తులు మొదలెట్టాడు. కథకు తగ్గట్టుగా సినిమాలో విలనిజం కూడా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. అందుకు అనుగుణంగా ముగ్గురు విలన్లు అవసరమయ్యారట సుకమార్ కు. ఆ ప్రకారంగానే ముగ్గురు విలన్లను సెట్ చేశాడట సుకుమార్. అయితే సుకుమార్ స్టైల్లో వీరిని ఎంపిక చేశాడట. తెలుగు నుంచి జగపతిబాబు, తమిళ్ నుంచి విజయ్ సేతుపతి, కన్నడ నుంచి రాజ్ దీపక్ శెట్టి లను తీసుకున్నాడట.

 

 

సుకుమార్ తన మార్క్ టిపికల్ స్క్రీన్ ప్లే నుంచి ఈమధ్య పక్కకు వచ్చేశాడు. పక్కా కమర్షియల్ ఫార్మాట్ లో తీసిన రంగస్థలం సృష్టించిన ప్రకంపనాలు గురించి తెలిసిందే. మళ్లీ అదే కమర్షియల్ హంగులతో ఈ స్మగ్లింగ్ కథను రాశాడట. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ లో బన్నీ జాయిన్ కానున్నాడు. మరి.. ముగ్గురు విలన్లతో బన్నీ ఫైట్ ఎలా ఉంటుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: