కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ చాలాకాలంగా తెలుగు మార్కెట్ పై పట్టు సాధించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవన్నీ ఫెయిల్ అవుతూనే ఉన్నాయి. విజయ్ తోటీ హీరోలు విశాల్, సూర్య, కార్తీ, జీవా లాంటి వాళ్లకు ఇక్కడ ఏదో ఒక టైంలో మంచి మార్కెట్ వచ్చింది. వాళ్లు నటించిన కొన్ని సినిమాలు అయినా హిట్ అవుతూ ఉంటాయి. కానీ విజయ్‌కు తెలుగులో ఎప్పుడూ కూడా సరైన సినిమా అనేది పడలేదు. తుపాకీ లాంటి ఒకటీ అరా సినిమాలు మినహా ఇక్కడ విజయ్‌కు పేరు తెచ్చిన సినిమా ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు.
ఇక విజయ్ నటిస్తోన్న తాజా చిత్రం మాస్టర్. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో కొనేందుకు బయ్యర్లే కరువు అయ్యారట. ఇక విజయ్ గత సినిమా బిగిల్ తెలుగులో విజిల్ పేరుతో రిలీజ్ అయ్యింది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన విజిల్ తమిళ నాట సూపర్ హిట్ గా నిలిచినా తెలుగులో మాత్రం పెద్దగా ఆడలేదు.
అంతేకాదు ఇక్కడ ఈ సినిమాను రు. 9 కోట్లకు కొంటే నష్టాలు వచ్చాయి. దీంతో ఇప్పుడు విజయ్ కొత్త సినిమా మాస్టర్‌ను తెలుగులో కొనేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. విజయ్ సినిమాలు ఇక్కడ హిట్ అయినా కూడా లాభాలు రావన్న నిర్ణయానికి వచ్చేశారు. పైగా విజయ్ ఇక్కడ తన సినిమాలను ప్రమోట్ చేసుకోడు. దీంతో ఇప్పుడు మాస్టర్‌ను రు. 4 కోట్లకు మించి కొనేందుకు కూడా ఎవ్వరూ ముందుకు రాని పరిస్థితి ఉందట.
ఇక యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కే ఈ సినిమాలో విజయ్ తో పాటుగా విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నాడు. మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తోంది. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ ఇస్తోన్న ఈ సినిమాను ఏప్రిల్ 8న రిలీజ్ చేస్తున్నారు.