ప్రముఖ ఛానెల్ లో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్లు సినిమాల్లో అవకాశాలు సంపాదిస్తూ నెలకు లక్షల్లో పారితోషికం అందుకున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో తెరకెక్కుతోన్న ప్రతీ సినిమాలో జబర్దస్త్ నటులకు అవకాశాలు దక్కుతున్నాయి. కొందరు కమెడియన్లు జబర్దస్త్ తమకు లైఫ్ ఇచ్చిందని పలు సందర్భాల్లో బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. అయితే కొన్ని నెలల క్రితం జబర్దస్త్ నుండి బయటికొచ్చిన ఆర్పీ ఆ షోపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
జబర్దస్త్ షో ద్వారా పరిచయమై, ఆ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఆర్పీ నెగిటివ్ కామెంట్లు చేయడం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది. కిర్రాక్ ఆర్పీ ఒక ప్రైవేట్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జీవితంలో తాను జబర్దస్త్ షోకు గానీ ఈటీవీకు గానీ మళ్లీ వెళ్లనని తెగేసి చెప్పారు. ఆర్పీ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. జబర్దస్త్ పై ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఎంతో మంది కమెడియన్లను అవకాశంతో పాటు బంగారం లాంటి భవిష్యత్తును ఇచ్చిన జబర్దస్త్ షోపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆర్పీ ఈ ఇంటర్వ్యూలో రోడ్డు మీద వెళుతున్న తనను పిలిచి ఎవరూ అవకాశాలు ఇవ్వలేదని అన్నారు. అవసరం, అవకాశాల మధ్య ఒప్పందమే జబర్దస్త్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. లైఫ్ ఇవ్వడం అనే మాట చాలా పెద్ద మాట అని అది ఎక్కడపడితే అక్కడ వాడకూడదని చెప్పారు. 
 
ఆర్పీకి మరొక షోలో అవకాశం వచ్చింది కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఒకవేళ అతనికి మరొక షోలో అవకాశం రాకపోతే ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారా...? అని నెటిజన్లు ప్రశ్నించారు. ఆర్పీ అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకుంటాడని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొందరు నెటిజన్లు మాత్రం ఆర్పీ చేసిన వ్యాఖ్యలకు మద్దతు పలుకుతూ ఉండటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: