తెలుగు సినిమాకు సరికొత్త టేకింగ్ నేర్పి దర్శకత్వానికి సరికొత్త దిశానిర్దేశం చేసిన దర్శకుడు ఖచ్చితంగా ‘రామ్ గోపాల్ వర్మ’ మాత్రమే. భారతీయ సినీ పరిశ్రమ కూడా ఒక్కసారా ఉలిక్కిపడి, ఆశ్చర్యంగా చూసిన టేకింగ్ ఆయన సొంతం. శివ సినిమాతో ఈ మాయ చేసిన ఆర్జీవీ తర్వాత ఎన్నో ప్రయోగాలు, మాఫియా సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు. శివ వచ్చి ముప్పై ఏళ్లు దాటుతున్నా ఇప్పటికీ శివ మ్యాజిక్ ను, వర్మ టెక్నిక్ ను ఇండస్ట్రీ మర్చిపోలేదంటే అతిశయోక్తి కాదు.

 

 

ఇంతటి సెన్సేషనల్ సినిమా శివ సినిమాను తెరకెక్కించడానికి మూలం ఆర్జీవీ కంటపడిన ఓ దృశ్యమే. విజయవాడలో చదువుకున్న వర్మకు అప్పట్లో అక్కడి రౌడీయిజంపై అవగాహన ఉంది. ఏదో చేయాలన్న తలంపుకి, తనలో ఉన్న సినిమా దర్శకత్వ తపనకు విజయవాడ రౌడీయిజం పునాది వేసింది. తర్వాత హైదరాబాద్ లోని అమీర్ పేటలో ఓ వీడియో షాప్ నిర్వహించిన ఆర్జీవికి అక్కడి గూండాయిజం ఆకర్షించింది. రౌడీయిజం, గూండాయిజం మధ్యలో ఉన్న సన్నని తేడాని పసిగట్టిన వర్మకు సినీ దర్శకుడు కావాలని నిశ్చయించుకున్నాడు. ఓరోజు రోడ్డుపై నడుస్తున్న తనకు కనపడిన్ ఓ గూండాగిరి దృశ్యమే శివ కథ రాసుకోవటానికి పునాది వేసిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు ఆర్జీవి.

 

 

దర్శకుడు బి గోపాల్ వద్ద నాలుగో అసిస్టెంట్ డైరక్టర్ గా నాగార్జున సినిమా కలెక్టర్ గారి అబ్బాయి సినిమాకు పనిచేసినా అక్కడ నేర్చుకునేది ఏమీ లేదని అతి తక్కువ టైమ్ లోనే బయటకు వచ్చేశాడట. నాగార్జున అపాయింట్ మెంట్ తీసుకుని శివ కథ చెప్పిన మరునాడే శివ టైటిల్ తో నాగార్జున పోస్టర్ రిలీజ్ చేయించాడని చెప్పుకొచ్చాడు. ఇక ఆ తర్వాత దర్శకుడిగా వర్మ ప్రస్థానం, బాలీవుడ్ లో ఎదిగిన తీరు ఇప్పటికీ మరే దర్శకుడికీ సాధ్యం కాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: