టాలీవుడ్‌లో ఎంద‌రో లేడీ డైరెక్ట‌ర్స్ చెర‌గ‌రాని ముద్ర వేశారు. అందులో దివంగ‌త‌ నటి, దర్శకురాలు, సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి విజయ నిర్మల కూడా ఒక‌రు. బాలనటిగా సినీ ప్రస్థానం ప్రారంభించి కథానాయికగా, దర్శకరాలిగా, నిర్మాతగా తన మార్క్ చూపారు. తెలుగు సినిమాను కొత్త పుంతలు తొక్కించి, అత్యధిక చిత్రాల్ని తెరకెక్కించిన ఉమెన్ గా గిన్నిస్ బుక్ రికార్డు సైతం సొంతం చేసుకున్న విజయనిర్మల గ‌త ఏడాది తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన సంగ‌తి తెలిసిందే. విశాలమైన కళ్ళు, మనోహరమైననవ్వు, స్పష్టంగా విభిన్నంగా పలికే సంభాషణా చాతుర్యం ఆమె అంచలంచెలుగాఎదిగేలా చేశాయి.

 

తన ఏడో ఏటనే 1950లో బాలతారగా మత్స్యరేఖ అనే తమిళ చిత్రం ద్వారా సినీ రంగంలోకి ప్రవేశించారు. 11వ ఏట పాండురంగ మహాత్యం అనే చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. రంగులరాట్నం సినిమాతో హీరోయిన్‌గా మారారు. ఇక విజయ నిర్మల నటిగా కొనసాగుతూనే దర్శకురాలిగా మారారు. దర్శకురాలిగా మీనా అనే చిత్రాన్ని 1971లో తెరకెక్కించారు. అప్పటి నుంచి 2009 వరకు మొత్తం 44 సినిమాలకు దర్శకత్వం వహించారు. 

 

ఇలా 44  సినిమాలకు దర్శకత్వం వహించి అంతకు ముందు ఇటలీ దర్శకురాలు పేరిట వున్న 27 సినిమాల మహిళా దర్శకత్వ రికార్డును తిరగరాసి విజయనిర్మల గిన్నిస్‌ రికార్డును అందుకోవడం గొప్పవిషయం. మ‌రియు ఇది కేవలం ఒక తెలుగు మహిళకే సాధ్యం అని నిరూపించింది విజ‌య‌మ్మ‌. అలాగే 2009 నేరం-శిక్ష దర్శకురాలిగా విజ‌య నిర్మ‌ల‌ చివరి చిత్రం. ఇక విజయ నిర్మలకు ఇష్టమైన సినిమాల్లో నాగేశ్వరరావు నటించిన ‘దేవదాస్’ ఒకటి. ఈ సినిమాను తన స్వీయ దర్శకత్వంలో కృష్ణ హీరోగా ‘దేవదాస్’ టైటిల్‌తో రీమేక్ చేసారు. అయితే.. విజయ నిర్మల మాత్రం 50 సినిమాలకు దర్శకత్వం.. వహించాలన్న కల మాత్రం నెరవేరకుండానే తిరిగిరాని లోకాల‌కు వెల్లిపోవ‌డం బాధాక‌రం అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: