ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో భయాన్ని సృష్టిస్తున్న కరోనా ఇప్పుడు భారత్ లో కూడా ప్రవేశించింది.  ఇప్పటికే 128 మంది ఈ వ్యాధి భారిన పడ్డట్టు చెబుతున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో ముగ్గురు మృతి చెందారు. అయితే కరోనాని నిర్మూలించడానికి జాగ్రత్తలు మాత్రమే పాటించగలం.. పరిశుభ్రంగా ఉంటే కరోనాని దరిచేరకుండా చేయొచ్చు అంటూ వైద్యులు సూచిస్తున్నారు. ఇక కరోనా గురించి సెలబ్రెటీలు తమదైన శైలిలో తగు సూచనలు పాటించాలని వీడియోలు చేసి పోస్ట్ చేస్తున్నారు.  ఇప్పటికే టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ, యాంకర్ సుమ, రామ్ చరణ్, ఎన్టీఆర్ మరికొంత మంది వీడియోలు చేసి సోషల్ మాద్యమాల్లో పోస్ట్ చేశారు.

 

తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కరోనా వైరస్ మహమ్మారిని ఎలా నియంత్రించవచ్చో ఓ వీడియో లో వివరించారు. ఇప్పుడు కావాల్సింది ప్రజలు సామాజిక ఎడం పాటించడమేనని తెలిపారు.  ఒకరితో ఒకరు కలవకుండా సాధ్యమైనంత దూరంగా ఉండడానికి ప్రయత్నించాలని, ఇది కష్టసాధ్యమైన నిర్ణయమే అయినా పాటించకతప్పదని సూచించారు.  ప్రజాహితం కోసం మన సామాజిక జీవనాన్ని త్యాగం చేయాల్సిన సమయం వచ్చింది. మీ కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కువ సమయం ఇంటిపట్టునే ఉండడం ద్వారా ఈ దశను అధిగమిద్దాం.

 

ఇలా చేయడం ద్వారా వైరస్ మరింత వ్యాపించకుండా చేసి, మరిన్ని ప్రాణాలను కాపాడిన వాళ్లమవుతాం. కరోనా అనేది ఒక వైరస్.. అందువల్లో ఇది వెంటనే వ్యాప్తి చెందుతుంది.  మన ప్రమేయం లేకుండానే అనర్థాలు జరిగిపోతుంటాయి. పరిసరాలను శుభ్రంగా ఉంచండి, తరచుగా మీ చేతులను శుభ్రంగా కడుక్కుంటూ ఉండండి. వీలైనంతగా శానిటైజర్లను వినియోగించడం అలవర్చుకోండి. మీరు అస్వస్థతకు గురయ్యామని భావించినప్పుడే మాస్కు ధరించండి.  అందరం కలసికట్టుగా పోరాడదాం... కరోనాను తరిమికొడదాం" అంటూ మహేశ్ బాబు పిలుపునిచ్చారు. ప్రస్తుతం మహేష్ బాబు వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: