మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పవన్ కల్యాణ్ అనతి కాలంలోనే పవర్ స్టార్ గా ఎదిగాడు. చిరంజీవి అభిమానులే పెట్టనికోటలా మారి పవన్ కల్యాణ్ ను ఆదరించారు. తొలి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా నుంచి ఖుషీ వరకూ ఫ్లాపు లేకుండా వరుసగా ఏడు సినిమాలు హిట్ అయ్యాయి. ఒకదానిమించి మరొకటి హిట్ సాధించి ఖుషీతో చిరంజీవిని మించి క్రేజ్ ను సాధించాడు పవన్ కల్యాణ్.

 

 

అయితే 2003లో వచ్చిన జానీ నుంచి వరుస ఫ్లాపులు ఎదుర్కొన్నాడు పవన్. జానీ, గుడుంబా శంకర్, బాలు, బంగారం, అన్నవరం.. అన్నీ ఫ్లాపులే. 2008లో త్రివిక్రమ్ తో చేసిన జల్సా సూపర్ హిట్ అయినా పవన్ మార్క్ బ్లాక్ బస్టర్ మాత్రం కాలేదు. ఫ్యాన్స్ కు పవన్ సినిమా అంటే ఖుషీ స్థాయి విజయమే కావాలి. తర్వాత వచ్చిన పులి, తీన్ మార్, పంజా సినిమాలు ఒకదాని మించి మరొకటి డిజాస్టర్లయ్యాయి. ఈ దశలో దర్శకుడు హరీశ్ శంకర్ తెరకెక్కించిన గబ్బర్ సింగ్ మూవీ పవన్ కల్యాణ్ లోని అసలైన సత్తాను, పవన్ స్థాయి వసూళ్లను సాధించింది. అసలైన హిట్ పడితే పవన్ సినిమా ప్రభంజనం ఎలా ఉంటుందో నిరూపించింది గబ్బర్ సింగ్.

 

 

పక్కా మాస్, హీరోయిజం, పవన్ మార్క్ వన్ మ్యాన్ షోను హరీశ్ శంకర్ ఆ సినిమాలో పొందుపరిచాడు. ఓ అభిమాని తన హీరో సినిమాను అంతే కసితో తీస్తే ఎలా ఉంటుందో అదే గబ్బర్ సింగ్. మెగాభిమానుల పదేళ్ల ఆకలి తీర్చి బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. నాక్కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది డైలాగ్ పేలిపోయింది. రాతలో పదును, తీతలో తెలివితో అభిమానులకు ఓ కానుకను అందించాడు హరీశ్ శంకర్. కొద్దిలో ఇండస్ట్రీ హిట్ మిస్సై బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: