విశ్వక్‌సేన్.. `ఈ నగరానికి ఏమైంది` సినిమాతో టాలీవుడ్‌లో హీరోగా అడుగు పెట్టిన ఈయ‌న‌.. ఫలక్‌నుమా దాస్ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. తెలంగాణ యాసలో, ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీతో ఆకట్టుకునే విశ్వ‌క్‌సేన్‌.. ఇటీవ‌ల నాని నిర్మాతగా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై తెర‌కెక్కిన‌ హిట్ సినిమాతో మ‌రింత పాపుల‌ర్ అయ్యాడు. హిట్ చిత్రం మంచి విజయం సాధించడమే కాకుండా.. నటుడిగా విశ్వక్ స్థాయిని పెంచేసింది. ప్రతీ రివ్యూలోనూ విశ్వక్ నటనను కొనియాడటమే అందుకు నిదర్శనం. ఇదే జోరును కొనసాగిస్తూ తదుపరి సినిమా ఖరారు చేశాడు. ఈసారి ప్రేమ కథతో ‘పాగల్‌’గా రాబోతున్నాడు విశ్వక్‌. 

 

విశ్వక్‌సేన్ హీరోగా ల‌క్కీ మీడియా బ్యాన‌ర్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తోన్న పాగ‌ల్ చిత్రం షూటింగ్ గురువారం హైద‌రాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ఈ చిత్రం ద్వారా న‌రేష్ కుప్పిలి ద‌ర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు స్క్రిప్ట్‌ను చిత్ర బృందానికి అందజేశారు. రానా దగ్గుబాటి క్లాప్‌నిచ్చారు. జెమిని కిరణ్‌ స్విచ్చాన్‌ చేశారు. ముహూర్తపు సన్నివేశానికి త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించారు. ఈ ప్రారంభ వేడుక‌లో చిత్రసీమ‌కు చెందిన ప‌లువురు ప్రముఖులు హాజ‌రై యూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. 

 

ఇక‌  ప్రస్తుతం ఉన్న పరిస్థితులన్ని సర్దుకున్నాక ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్ మొద‌లుకానుంది. అయితే ఈ చిత్రంలో అర్జున్ రెడ్డి లో హీరో క్యారెక్టర్ మాదిరిగా అగ్రెసివ్ నెస్, ఓవర్ పొసెసివ్ నెస్ వుండే హీరో క్యారెక్టర్ లో విశ్వక్ సేన్ క‌నిపించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్పటికే విశ్వక్ సేన్ ఫ్యాన్స్ కు విజయ్ ఫ్యాన్స్ కు మధ్య అంత సయోధ్య లేదు. ఇలాంటి నేపథ్యంలో విశ్వక్ సేన్ పోయి పోయి అర్జున్ రెడ్డి లాంటి కథ ఎంచుకుని .. విజ‌య్ రూట్‌లోనే వెళ్తూ రివేంజ్ తీర్చుకునేలా క‌నిపిస్తున్నాడు. మ‌రి దీన్ని విజ‌య్ ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారో చూడాలి.


 

మరింత సమాచారం తెలుసుకోండి: