బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ లండన్ నగరానికి వెళ్లి పది రోజుల క్రితమే ఇండియాకి తిరిగి వచ్చింది. అయితే ఆమె లండన్ కి వెళ్ళిన విషయం దాచిపెట్టి తాజాగా లక్నో లోని ఒక డిన్నర్ పార్టీలో పాల్గొన్నది. ఆ పార్టీలో రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, ఆమె 46 ఏళ్ల కుమారుడు దుశ్యంత్ కూడా పాల్గొన్నారు. పాల్గొనడమే కాక సింగర్ కనికా కపూర్ తో భోజనం చేసే అనంతరం ఆమెతో కలిసి ఫోటోలు దిగారు. ఈ రెండు గంటల డిన్నర్ కార్యక్రమం పూర్తయ్యేంత వరకు కనికా కపూర్ దుశ్యంత్, వసుంధర రాజే కి చాలా దగ్గరగా మెలిగింది.

 

 


దుశ్యంత్ రాజస్థాన్ యొక్క జలవార్-బారన్ నియోజకవర్గానికి చెందిన భారతీయ జనతా పార్టీ లోక్ సభ ఎంపి. అయితే ఈరోజు ఉదయం కనికా కపూర్ ఇంస్టాగ్రామ్ ఖాతాలో... ' గత నాలుగు రోజులుగా నాకు ఫ్లూ ఉన్నట్టు అనిపించింది. అందుకే ఆసుపత్రికి వెళ్లి చెకప్ చేయించుకున్నాను. అయితే నా వైద్య పరీక్షలలో కోవిడ్ 19 పాజిటివ్ అని వచ్చింది. ప్రస్తుతం నేను చికిత్సను పొందుతున్నాను' అని చెప్పింది.

 

 


ఐతే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సెలబ్రెటీ కి కరోనా వైరస్ సోకిందని తెలిసేసరికి ఆ వార్త విపరీతంగా వైరల్ అయింది. ఎట్టకేలకు వసుంధరా రాజే, దుశ్యంత్ కి కూడా తెలిసింది. దాంతో వారు వెంటనే అప్రమత్తమై స్వీయ నిర్బంధంలోకి వెళ్ళిపోయారు. మొదటిలో ఈ విషయం తెలియక లోక్ సభ ఎంపీ అయిన దుశ్యంత్ పార్లమెంటు సమావేశాల కి హాజరయ్యాడు. ఐతే దుశ్యంత్ పక్కన మూడు గంటల పాటు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ కూర్చున్నాడట. ఆ విషయం ఆయన సామాజిక మాధ్యమాలలో తెలుపుతూ తీవ్ర ఆగ్రహంతో కూడిన ఆవేదనను వ్యక్తం చేశాడు. 

 

 

 

భారతదేశ ప్రజలందరినీ ఇళ్లలో కూర్చోమని చెప్పిన మోడీ పార్లమెంటు సమావేశాలను కొనసాగిస్తూ మంత్రుల ఆరోగ్యంతో ఎందుకు ఆడుకుంటున్నారు అంటూ మండిపడ్డారు. దుశ్యంత్ వలన పార్లమెంట్ కు హాజరైన కొంతమంది స్వీయ నిర్బంధంలోకి వెళ్ళిపోయారని ఆయన చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పార్లమెంటు సమావేశాలు వెంటనే వాయిదా వేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం కనికా ఎవరెవరితో కాంటాక్ట్ అయిందో తెలుసుకునే పనిలో పడిపోయారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: