కరోనా వైరస్. తన ఉనికిని బలంగా చాటుకుంటోంది. ఒక్కో దేశం దాటుకుంటూ భారత్ లో అడుగుపెట్టింది. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లో దాదాపుగా కరోనా కేసులు ఎక్కువగానే   భారత్ లో నమోదు అవుతున్నాయి. ప్రస్తుతం రెండవ దశలో కరోనా ప్రభావం ఉంది. అంటే విదేశాల నుంచి వస్తున్న వారికే ఈ కరోనా ఉంది.

 

మరి మూడవ, నాలుగవ దశ వచ్చిందంటే 130 కోట్ల పై చిలుకు జనాభా కలిగిన భారత్ కకావికలమవుతుంది. దాంతో భారత్ అప్రమత్తమవుతోంది. దేశంలో చూసుకుంటే కేంద్రం కఠిన చర్యలతో ముందుకు వస్తోంది. కరోనా భయం పెంచుతూనే ధైర్యం చెబుతోంది. 

 

అందులో భాగంగానే ప్రధాని మోడీ ఈ ఆదివారం అంటే 22న జనతా కర్ఫ్యూకి పిలుపు ఇచ్చారు. ఆ రోజు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది వరకూ పద్నాలుగు గంటల పాటు కరోనా మీద యుధ్ధం చేయాలని, అంతా ఇంట్లో కూర్చుకుని సంఘీభావం ప్రకటించాలని కూడా ప్రధాని కోరారు.

 

దానిని బాలీవుడ్ నుంచే కాదు అన్ని వుడ్ల నుంచి మంచి మద్దతు లభించింది.  జనతా కర్ఫ్యూలో నేను పాల్గొంటున్నాను. అందరూ పాల్గొనాలి. ఎవరి ఇంట్లో వారు ఉంటూ మనమంతా ఒక్కటి అని తెలియచేయాలని సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ పిలుపు ఇచ్చారు.

 

అలాగే మరో సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ అంతా జనతా కర్ఫ్యూలో పాల్గొనాలని,మనం ఒక్కటి అని ప్రపంచానికి తెలియచేయాలని కోరారు.  ప్రతీ ఒక్కరూ స్వీయ నిర్బంధం, స్వీయ క్రమశిక్షణ పాటించాలని బాలీవుడ్ నటి శిల్పా శెట్టి పిలుపు ఇచ్చారు.

 

అరవయ్యేళ్ళు పైబడిన వారు, పదేళ్ళ లోపు చిన్నారులు ఇంటికే పరిమితం కావాలని  అనుష్క శర్మ కోరారు. జనతా కర్ఫ్యూ అధ్బుతమైన ఆలోచన అని కోలీవుడ్ నటుడు మాధవన్ ప్రశంచినారు. మనమంతా కలిసి ముందుకు సాగుదామని, ఎవరికి వారుగా ఉంటూ భవిష్యత్తు కోసం నిలుద్దామని ఆయన పిలుపు ఇచ్చారు. 

 

మొత్తానికి జనతా కర్ఫ్యూకి మంచి మద్దతు టాలీవుడ్లో కూడా లభిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు సెలిబ్రిటీలు ఇదే మన నినాదం కావాలని కోరారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: