తండ్రికి తగ్గ తనయుడు...గురువును మించిన శిష్యుడు అంటే ఎవరికైనా చూపించాల్సిన ఉదాహరణ కోడి రామకృష్ణ. తల్లి తండ్రులు అందరు తమ పిల్లలు గొప్ప వాళ్ళు కావాలని తాపత్రయ పడతారు. అలాగే గురువులు మా శిష్యుడు మమ్మలిని మించిపోవాలని అభిలాషిస్తారు. అందుకే అటు తల్లి తండ్రుల ఆశీస్సులు ఇటు గురువు గారు దాసరి నారాయణ రావు గారి అండ దండలతో తెలుగు చిత్ర పరిశ్రమలో వంద కు పైగా సినిమాలని తెరకెక్కించారు. ప్రతీ సినిమా సూపర్ హిట్ ని అందుకుంది. ఒక దర్శకుడి కోడి రామకృష్ణ ఇచ్చినన్ని సక్సస్ లు మరే దర్శకుడు ఇవ్వలేదంటే నమ్మితీరాల్సిందే. 

 

వాస్తవంగా కోడి రామకృష్ణ నటుడవ్వాలనే సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. ఇంకా చెప్పాలంటే హీరో అవ్వాలన్న కోరిక కోడి రామకృష్ణ కి బలంగా ఉండేది. కాని కళామ తల్లి ఆయనని దర్శకుడిని చేసింది. పగలు చదువుకుంటు రాత్రిళ్ళు పేయింటింగ్ పనులు చేస్తుండే వారు రామకృష్ణ. ఆ క్రమమంలో నటన మీద ఉన్న ఆసక్తితో ఫొటోలు తీయించుకొని కొందరి దర్శకులకి పంపేవారు. అయితే ఈ విషయం తండ్రికి తెలియండం తో "ముందు డిగ్రీ పూర్తి చేసుకో .. ఆ తర్వాత నీకు నచ్చిన రంగంలో ప్రయత్నాలు చేసుకో" .. అంటూ సలహా ఇచ్చారు. దాంతో డిగ్రీ పూర్తి చేశారు కోడి రామకృష్ణ.

 

చిన్నప్పటి నుంచి రామకృష్ణకు నాటకాలంటే చాలా ఆసక్తి. అదే ఆసక్తి తో మద్రాసు నుంచి 'కాకరాల' వంటి నాటకరంగ ప్రముఖుల్ని కూడా నటించేందుకు పాలకొల్లు పిలిపంచేవారు. రామకృష్ణ తన స్నేహితుల్లోనూ రకరకాల ఊతపదాలు, మ్యానరిజాలు ఉన్నవారిని ఎన్నుకుని అందుకుతగ్గ పాత్రలు సృష్టించి వారితో నటింపజేసేవారు. అలా ఆసక్తి ఉన్న వాళ్ళలో రామకృష్ణ స్నేహితుడు, తెలుగు చిత్ర దర్శకుడు రేలంగి నరసింహా రావు కూడా ఒకరు. రామకృష్ణ కి సుడిగుండాలు సినిమాలోని కోర్టుసీనులో అక్కినేని నాగేశ్వరరావు వాదించే సన్నివేశాన్ని చాలా అద్భుతంగా ప్రదర్శిస్తారు. అదే ఆయన సినీ రంగం వైపు వెళ్ళడానికి ఒక ప్రధాన కారణం.

 

దాసరి నారాయణరావు మొదటిసారి దర్శకత్వం వహించిన తాత మనవడు చూశాకా రామకృష్ణ దాసరి గారి దగ్గరే దర్శకత్వ శాఖలో పనిచేయాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. అదే సినిమా 50 రోజుల వేడుక కి పాలకొల్లు వచ్చిన దాసరి గారితో పరిచయం ఏర్పడటం ఆ తర్వాత ఆయన దగ్గర దర్శకత్వ శాఖలో చేరే అవకాశం రావడం జరిగిపోయాయి. 
దాసరి నారాయణరావు ఒకేసారి రెండు, మూడు సినిమాలకు దర్శకత్వం వహిస్తూండేవారు. ఆ క్రమంలో ఎవరికి వారే యమునా తీరే, స్వర్గం నరకం, మనుషుల్లో దేవుడు అన్న మూడు సినిమాలకు కోడి రామకృష్ణను ఒకేసారి అసిస్టెంట్ గా తీసుకున్నారు. దాసరి తెరకెక్కించిన చాలా సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేశారు.

 

ఆ తర్వాత కోడి రామకృష్ణకి ఎలాగైనా దాసరి గారినిని దర్శకునిణ్ణి చేసిన కె. రాఘవ బ్యానర్లోనే దర్శకుడిగా సినిమా ఇండస్ట్రీకి పరిచయమవ్వాలని పట్టుదలతో ఆయన నిర్మాతగా చిరంజీవి మాధవి జంటగా "ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య" సినిమా ని తెరకెక్కించి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నారు. అంతే కాదు ఈ సినిమా 500 రోజులకి పైగా ప్రదర్శింపబడి ఇండస్ట్రీలో రికార్డ్ నెలకొల్పింది. ఈ సినిమా తర్వాత రెండవ సినిమాగా వచ్చిన "తరంగిణి" కూడా 500 రోజులకి పైగా ప్రదర్శింపబడటం గొప్ప విశేషం. ఇక ఆ తర్వాత నుండి కోడి రామకృష్ణ వెనక్కి తిరిగి చూసుకోకుండా తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న టాప్ హీరోలందరితోను బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలని తీసి రికార్డ్ సృష్టించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: