తెలంగాణ ప్రభుత్వం కరోనా పై తన యుద్ధాన్ని కొనసాగిస్తూ ఈ నెల 31 వరకు లాక్ డౌన్ ప్రకటించడంతో జనజీవనం ఎక్కడికక్కడ స్థంబించి పోయింది. ఇలాంటి పరిస్థితులలో చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవితాలను కొనసాగిస్తున్న వారిని కార్మికులను ఆదుకోవడానికి ప్రభుత్వం రంగంలోకి దిగింది. 


ప్రస్తుతం ఈ పరిస్థితులలో సినిమా షూటింగ్ లు ఆగిపోవడంతో సినిమాలలో చిన్నచిన్న పాత్రలు పోషించే ఎక్స్ ట్రా ఆర్టిస్టులు సినీ కార్మికుల పరిస్థితి దయనీయంగా తయారైంది. టాప్ హీరోలు అంతా మీడియా ముందుకు వచ్చి కరోనా వ్యాధి సోకకుండా చేతులు నిరంతరం ఎలా శుభ్ర పరుచుకోవాలో చెపుతుంటే రాజశేఖర్ మాత్రం రియల్ హీరోగా మారి కృష్ణానగర్ లో ఉండే అనేకమంది పేద సినీ కళాకారుల సినిమా కార్మికుల ఆకలి తీర్చే కార్యక్రమం చేపట్టడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 


వారందరికీ 10 రోజులకు సరిపోయే నిత్యావసర వస్తువులను రాజశేఖర్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందిస్తూ నిన్న జనతా కర్ఫ్యూ రోజున చేపట్టిన కార్యక్రమం రాజశేఖర్ మంచి మనసును సూచిస్తోంది అంటూ ప్రశంసలు వస్తున్నాయి. వాస్తవానికి ఇలాంటి కార్యక్రమం ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరించే చిరంజీవి లాంటి స్థాయిగల వ్యక్తులు చేయవలసిన పని. అయితే మన టాప్ హీరోలు అంతా షూటింగ్ లు ఆగిపోవడంతో ఈ గ్యాప్ ను హాలిడేగా ఎంజాయ్ చేస్తూ తమ కుటుంబ సభ్యుల మధ్య తమ కాలం గడుపుతున్నారు.


అయితే ప్రస్తుతం సినిమాలు లేక ఇబ్బంది పడుతూ అనేక సమస్యలు మధ్య చిక్కుకున్న రాజశేఖర్ లాంటి హీరోలు తనకు తాను గా చొరవ తీసుకుని చేయడం అతడి వ్యక్తిత్వానికి నిదర్శనం. దీనితో మన టాప్ హీరోలు కూడ కేవలం సందేశాలు మాని ప్రస్తుత కరోనా సమస్య వల్ల షూటింగ్ లు లేక ఇబ్బంది పడుతున్న పేద సినిమా కళాకారులను ఆదుకునే కార్యక్రమం చేపడితే అప్పుడే వారు రియల్ హీరోలు అవుతారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: