సినిమా పరిశ్రమలో టాప్ హీరోలు ఉన్నారు. సూపర్ స్టార్లు ఉన్నారు. తమ పేరుకు ముందు ఎన్నో బిరుదులు తగిలించుకుని ఫ్యాన్స్ చేత డెమ్మీ గాడ్స్ గా పిలిపించుకునే స్టార్లు ఎంతో మంది ఉన్నారు. వీరంతా తెర ముందు హీరోలు. డైరెక్టర్ చెప్పిన ప్రకారం చేస్తూ అందాల భామల గ్లామర్ అండతో  రైటర్ల డైరెక్టర్ల  తెలివితో, మ్యూజిక్ డైరెక్టర్ జోరుతో  హోరుతో, సరైన వెకేషన్  సీజన్ చూసుకుని మరీ  జనం ముందుకు వచ్చేసి నాలుగు డబ్బులు సంపాదించి తామే సూపర్ డూపర్ స్టార్లమని గొప్పలకు పోయే హీరోలు. కానీ అసలు  హీరోయిజం అంటే ఏంటి.

 

మనకు ఉన్న దాంటో ఒక ముద్ద పక్కవాడికి పెడితే  ప్రతీవాడూ హీరోనే . ఇక కష్టంలో రెండు ముద్దలు పెడితే దేవుడే. ఇపుడు కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తూ భారత్ లో అడుగుపెట్టింది. దాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు చేయాల్సినవి చేస్తున్నాయి. అయితే లాక్ డౌన్ ల పేరిట ఇంట్లో కూర్చోమంటే పేదలకు  బతుకు ఉంటుందేమో కానీ మెతుకు అందదు. 

 

మరి అలాంటి వారిని ఆదుకోవడానికి హీరో రాజశేఖర్ నడుం బిగించారు. ఆయన సినీ కార్మిక కుటుంబాలకు తనకు తోచిన రీతిన సాయం చేస్తున్నారు. వారిని రాజశేఖర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అదుకుంటున్నాడు. ఆయన చూపుతున్న ఈ శ్రధ్ధ, సహాయ గుణంతో అసలైన హీరోగా మారిపోయారు.

 

అదే విధంగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. ఆయన సమాజానికి ఏదో చేయాలనుకున్న  తపన ఉన్న మనిషి అని గతంలోనే రుజువు అయింది.  అటువంటి ప్రకాష్ రాజ్ తన స్టాఫ్ కి మూడు నెలల జీతం ముందుగా ఇచ్చేశారు. అలాగే తన పొలంలో పనిచేసేవారికి కూడా ఆయన ఆర్ధిక సాయం చేస్తున్నారు. మరింతగా చేస్తానని కూడా చెబుతున్నారు. నిజంగా వీరే కదా మన హీరోలు. 

 

వీరిని స్పూర్తిగా తీసుకుని మరింతమంది ముందుకు వస్తే పేదవాడు ఆకలితో చావడు. లేకపోతే కరోనా మహమ్మారి కాటు వేయకముందే ప్రాణాలు వదిలేయడం ఖాయం. ఈ దేశం ఎంతో మంది ధనవంతులు  ఉన్న పేద దేశం. అందుకే ఇపుడు టైం వచ్చింది. హీరోలుగా నిరూపించుకునే అవకాశం కూడా వచ్చింది. పేద ఆకలి తీర్చి హీరోలు అయ్యేదెందరో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: