తెలుగు సినీ పరిశ్రమను మూడు దశాబ్దాలకు పైగా నెంబర్ వన్ హీరోగా ఏలుతున్న మెగాస్టార్ చిరంజీవి కొత్త ప్రస్థానాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్న సోషల్ మీడియాలోకి ఎంటరై చిరంజీవి కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఉగాది పండగ సందర్భంగా ఆయన ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ లో అకౌంట్స్ ఓపెన్ చేశారు. అశేషమైన అభిమాన బలం ఉన్న మెగాస్టార్ కు ఈ అకౌంట్లకు మంచి స్పందన లభించింది. ట్విట్టర్ లో తొలి 20 నిమిషాల్లోనే 25వేల ఫాలోవర్లు రావటంతో పాటు ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది.

 

 

మెగాస్టార్ సోషల్ మీడియాలో ఎంటర్ అయ్యాక చేసిన తొలి ట్వీట్లు ప్రత్యేకత సంతరించుకున్నాయి. తొలిగా ’21 రోజులు మనందరినీ ఇళ్లలోనే ఉండమని మన భారత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశం కరోనా మహమ్మారిని ఎదుర్కోవటానికి ఓ అనివార్యమైన చర్య. ఈ క్లిష్ట సమయంలో మనం, మన కుటుంబాలు, మన దేశం సురక్షితంగా ఉండటానికి మన ప్రియ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు, మన ప్రియ ముఖ్యమంత్రులు శ్రీ కేసీఆర్ గారు, శ్రీ జగన్ గారు ఇచ్చే ఆదేశాలను పాటిద్దాం. ఇంటి పట్టునే ఉందాం. సురక్షితంగా ఉందాం’ అని దేశ సంక్షేమం కోరుతూ ఆయన ట్వీట్ చేశారు.

 

 

రెండో ట్వీట్ గా., ‘అందరికి శార్వరినామ ఉగాది శుభాకాంక్షలు. నాతోటి భారతీయులందరితో, తెలుగు ప్రజలతో, నాకు అత్యంత ప్రియమైన అభిమానులందరితో నేరుగా ఈ వేదిక నుంచి మాట్లాడగలగటం నాకెంతో ఆనందంగా ఉంది. ఈ సంవత్సరాది రోజు ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారిని కలసికట్టుగా జయించడానికి కంకణం కట్టుకుందాం. ఇంటిపట్టునే ఉందాం. సురక్షితంగా ఉందాం’ అని ట్వీట్ చేశారు. మెగాస్టార్ సోషల్ మీడియాలోకి రావడం మెగా అభిమానుల్లో కొత్త ఆనందం వెల్లివిరుస్తోంది. అనేకమంది సెలబ్రిటీలు కూడా మెగాస్టార్ కు స్వాగతం పలికారు.

మరింత సమాచారం తెలుసుకోండి: