ఇప్పటి వరకు ఎన్నో ప్రయోగాలు చేసిన సుధీర్ బాబు నటుడుగా మంచి ఇమేజ్ ని సంపాదించుకున్నాడు కాని కమర్షియల్ హీరోగా ఇంతవరకు సక్సస్ కాలేకపోయాడు. ఇలాంటి పరిస్థితులలో ఈ ఉగాది కి ‘వి’ విడుదల అయి ఉంటే ఆ మూవీ తరువాత తన కెరియర్ గ్రాఫ్ బాగా పెరుగుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. 


అయితే కరోనా సమస్యతో సినిమాలు అన్నీ వాయిదా పడటంతో ‘వి’ ఎప్పటికి విడుదల అవుతుందో అతడికి కూడ తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలో నిన్న ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ సుధీ బాబు కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. గతంలో తాను బాలీవుడ్ లో ‘బాగి’ సినిమాలో నటించిన తరువాత తనకు వచ్చిన ఒక మంచి అవకాశాన్ని ఒక బయోపిక్ మూవీ ఎలా దూరం చేసిందో వివరించాడు. 


తనకు బాలీవుడ్ లో నిర్మాణంలో ఉన్న ‘బ్రహ్మాస్త్ర’ లాంటి భారీ సినిమాలో అవకాశం వచ్చిందని అయితే ఈ మూవీ అవకాశాన్ని తాను పుల్లెల గోపీచంద్ బయోపిక్ నిర్మాణం జరుగుతుంది అన్న నమ్మకంతో తాను ఆ అవకాశాన్ని వదులుకున్న విషయాన్ని వివరించాడు. రణబీర్ కపూర్ ఆలియా భట్ లతో పాటు అనేకమంది భారీ తారాగణం నటిస్తున్న ఈ మూవీలో తాను ఎంపిక అయిన విషయాన్ని బయటపెడుతూ తనకు అప్పట్లో పుల్లెల గోపీచంద్ పాత్ర ఎలా అడ్డుగా నిలిచిందో వివరించాడు.


వాస్తవానికి పుల్లెల గోపీచంద్ పాత్ర కోసం తాను అప్పట్లో బాగా సన్నపడవలసి వచ్చిందని అయితే ‘బ్రహ్మాస్త్ర’ మూవీలోని పాత్ర లుక్ కోసం తాను మళ్ళీ బాగా లావు అవ్వడమే కాకుండా ఎకంగా 90 రోజుల డేట్స్ అడగడంతో తాను గోపీ చంద్ బయోపిక్ పాత్ర పోగొట్టుకుంటానేమో అన్న భయంతో తాను ‘బ్రహ్మాస్త్ర’ మూవీ వదులుకున్నాను అని అంటున్నాడు. దీనితో తాను ఊహించుకున్న గోపీ చంద్ బయోపిక్ నిర్మాణం మొదలు అవ్వక ‘బ్రహ్మాస్త్ర’ లాంటి మూవీలో అవకాశం కోల్పోయి తాను ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘వి’ వాయిదా పడి ప్రస్తుతం సుధీర్ బాబు తీవ్ర నిరాశలో ఉన్నాడు.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: