దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉండటంతో కేంద్రం లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. కేంద్రం లాక్ డౌన్ ప్రకటించినా తొలిరోజు ప్రజలు నిబంధనలు పాటించలేదు. చాలా ప్రాంతాలలో ప్రజలు గుంపులు గుంపులుగా రోడ్లపైకి వచ్చారు. ప్రజలు నిబంధనలు పాటించకపోవడంతో కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని భావించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలను కఠినంగా అమలు చేయాలని అధికారులకు, పోలీసులకు ఆదేశాలు జారీ చేశాయి. 
 
పోలీసులు పలు చోట్ల కేసులు నమోదు చేస్తూ జరిమానాలు విధించినా ప్రజల్లో పెద్దగా మార్పు రాలేదు. చివరకు పోలీసులు లాఠీచార్జీ చేయడం మొదలుపెట్టారు. అనవసరంగా రోడ్లపై తిరిగేవారిని, పదేపదే రోడ్లపై కనిపించే వాళ్లను తరిమి తరిమి కొడుతున్నారు. రోడ్లపై గుంపులు గుంపులుగా కనిపిస్తే ఉతికి ఆరేస్తున్నారు. పోలీసులు జనాన్ని కొట్టడానికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 
 
సోషల్ మీడియాలో విచక్షణారహితంగా జనాలపై పోలీసులు దాడులు చేస్తున్న వీడియోలను షేర్ చేస్తూ బీజేపీ నేత, సినీనటి మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేశారు. "బ్లడీ స్టుపిడ్ పోలీస్... మీరు డ్యూటీ చేస్తున్నారు ఓకే. వాళ్లు కూడా మనుషులే... మీరు కూడా మనుషుల్లా ప్రవర్తించండి.. ప్రజలెవరూ కారణం లేకుండా బయటకు రారు... ఎవరైనా బయటకు వస్తే జరిమానా విధించాలే తప్ప సైకోల్లా ప్రవర్తించరాదు" అని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. 
 
ప్రసుతం సోషల్ మీడియాలో ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు కొందరు మాధవీలతకు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తుంటే మరికొందరు మాత్రం మాధవీలతను తిడుతున్నారు. పోలీసుల చేతిలో దెబ్బలు తిని పలు చోట్ల చనిపోయిన ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వం, పోలీస్ ఉన్నతాధికారులు పోలీసులు జనాలపై విచక్షణారహితంగా దాడులు చేయకుండా కొన్ని మార్గదర్శకాలను సూచించాలని ప్రజలు కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: