భారతీయ చలన చిత్ర రంగంలో తన కంటూ ప్రత్యేకత చాటుకున్న విశ్వనటుడు కమల్ హాసన్ గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే.  తాజాగా క‌మ‌ల్ హాస‌న్ గృహ నిర్భంధంలో ఉన్న‌ట్టు కొద్ది రోజులుగా  పుకార్లు షికారు చేస్తున్నాయి. త‌న ఆరోగ్యం గురించి క‌నుక్కునేందుకు నాన్‌స్టాప్‌గా కాల్స్ వ‌స్తుండ‌డంతో క‌మ‌ల్ కొద్ది సేప‌టి క్రితం అధికారిక‌ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.  కొద్ది రోజులుగా కమల్ గృహనిర్భందంలో ఉన్నారని.. దీనికి కారణం గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ అధికారులు చేసిన పనే. అధికారులు కమల్ ఇంటికి హోం క్వారంటైన్ స్టిక్కర్ అతికించడం దుమారం రేపింది. తమ అభిమాన నటుడికి ఏమైంది? కరోనా బారిన పడ్డాడా? అని కమల్ ఫ్యాన్స్ టెన్షన్ పడ్డారు. కట్ చేస్తే, అలాంటిదేమీ లేదని స్వయంగా కమల్ హాసన్ చెప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

 

అవన్నీ రూమర్స్ అని కమలే స్పష్టం చేశారు. చెన్నై కార్పొరేషన్ అధికారులు కరోనావైరస్ రోగుల ఇళ్లకు అంటించే 'ఐసొలేషన్' (గృహ నిర్బంధం) స్టిక్కర్ అంటించారు. అయితే, పొరపాటున దీనిని అతికించామని తెలుసుకున్న అధికారులు కొన్ని గంటల వ్యవధిలోనే దానిని తొలగించారు. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది.  దాంతో కమల్ స్వయంగా రంగంలోకి దిగారు..  నా ఆరోగ్యంపై మీరు చూపిస్తున్న ప్రేమ‌కి ధ‌న్యుడిని. ఆళ్వారుపేటలోని  ఇంట్లో గత కొన్నేళ్లుగా  నివసించట్లేదు.

 

కేవ‌లం పార్టీ సమావేశాలు నిర్వహించేందు కుగాను పార్టీ కార్యాలయంగా ఉపయోగిస్తున్నాం.   ప్రస్తుతం ఆ ఇంటిని మక్కల్ నీది మయ్యం పార్టీ ఆఫీస్ గా వినియోగిస్తున్నాం. కాబట్టి, నేను క్వారంటైన్‌లో ఉన్నానని వచ్చిన వార్తలు అవాస్తవం’’ అని తన ప్రకటనలో కమల్ హాసన్ స్పష్టం చేశారు. అంతేకాదు ముందు జాగ్రత్తగా, కరోనా వైరస్ నుంచి రక్షణ పొందడంలో భాగంగా తాను సామాజిక దూరాన్ని పాటిస్తున్నానని కమల్ తెలిపారు. ప్రజలు కూడా సామాజిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: