టాలెంట్ ఉన్నా కొంతమంది ఎందుకో తెలియదు నిలదొక్కుకోలేక పోతుంటారు. వాళ్లలో అక్కినేని అఖిల్ ని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. నడవడం చేతకాని వయసులోనే హిట్ రుచి చూసిన అఖిల్ ఇండస్ట్రీలో హీరోగా అయిన తర్వాత దాని కోసం వెయిట్ చేయక తప్పడం లేదు. ఈసారి అతని బ్యాడ్ లక్ కరోనా రూపంలో వచ్చి మీద పడింది. అక్కినేని నాగార్జున నట వారసుడిగా 'అఖిల్' సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. ఆ సినిమా ఆశించినంత విజయం సాదించనప్పటికీ అఖిల్ స్క్రీన్ ప్రెజన్స్ కి మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత అక్కినేని ఫ్యామిలీకి 'మనం' లాంటి చిత్రాన్ని అందించిన విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో రెండో సినిమాగా 'హలో' చిత్రంలో నటించాడు. ఈ సినిమా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చినప్పటికీ మాస్ ఆడియన్స్ కోరుకొనే ఎలిమెంట్స్ లేకపోవడంతో సెన్సిబుల్ సినిమాగా మిగిలిపోయింది. మూడో సినిమాగా వచ్చిన మిస్టర్ మజ్ను కూడా అఖిల్ ని నిలబెట్టలేకపోయింది. అఖిల్ బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎంత ప్రయత్నించినా ఆ ఒక్కటి మాత్రం రావడం లేదు.

 

టాలెంటెడ్ ద‌ర్శ‌కుల‌తో ప‌ని చేసినా, సినిమాల‌కు పాజిటివ్ టాక్ వ‌చ్చినా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు సూపర్ హిట్ మాత్రం రాలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు నాలుగో సినిమాను డైరెక్ట‌ర్‌ బొమ్మరిల్లు భాస్కర్ తో చేస్తున్నాడు అఖిల్. దాదాపు తెలుగు ప్రేక్ష‌కులు అంతా మ‌రిచిపోయిన బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్' సినిమా చేయ‌బోతున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్, వాసు వర్మ నిర్మించనున్నారు. అల్లు అరవింద్ సమర్పకులుగా వ్యవహరిస్తారు. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీ సుందర్ దర్శకత్వం వహిస్తున్నారు. 

 

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్' చిత్రాన్ని సమ్మర్ కానుకగా ఏప్రిల్ లో విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. కానీ కరోనా వైరస్ నేపథ్యంలో చిత్ర షూటింగులు నిలిచిపోవడంతో ఈ సినిమా ఇప్పుడల్లా కంప్లీట్ అయ్యేలా కనిపించడం లేదు. ఈ చిత్రంలో ఇంకా కొన్ని సాంగ్స్, ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించాల్సి ఉంది. ప్రస్తుత కరోనా పరిస్థితులు చూస్తే షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యేది కూడా చెప్పలేని పొజిషన్. అన్నీ అనుకున్నట్లు జరిగితే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్' సినిమా జూన్ లేదా జులై నెలలో విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా సూపర్ హిట్ కోసం ఆకలి మీదున్న అఖిల్ కరోనా కారణంగా మంచి సీజన్ మిస్సయ్యాడని చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: