హిందువుల పండగల్లో శ్రీరామనవమికి ఓ ప్రత్యేకత ఉంది. ప్రతి ఊరిలోనూ రామయ్య కల్యాణం జరుగుతుంది. చలువ పందిళ్లు, వేద మంత్రాల మధ్య రామయ్య కల్యాణం కడు రమణీయంగా జరుగుతుంది. కల్యాణం అనంతరం ఇచ్చే పానకం భక్తులకు ఎంతో ఇష్టమైంది. ఇంతటి విశిష్టత ఉన్న సీతారాముల కల్యాణాన్ని మన తెలుగు సినిమాల్లో కూడా సందర్భాన్ని బట్టి అంతే ఘనంగా చూపిస్తూంటారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించగా 1995లో వచ్చిన అల్లుడా మజాకా సినిమా ఇందుకు ఓ ఉదాహరణ.

 

 

సినిమా కథ ప్రకారం హీరో ఉండే గ్రామంలోని రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఇందుకోసం సినిమాలో ఫస్ట్ సాంగ్ అంతా శ్రీరాముడి గురించే ఉంటుంది. ‘మా ఊరి దేవుడు.. అందాల రాముడు..’ అంటూ ఈ పాట రచన మొదలవుతుంది. శ్రీరాముడి జననం నుంచి సీతా పరిణయం, వనవాసం, సీతాపహరణ, లంకా దహనం, శ్రీరామ పట్టాభిషేకం.. ఇలా మొత్తం రామాయణం గురించి ఉంటుంది. వేటూరి రాసిన సాహిత్యానికి కోటీ సంగీతం అందించారు. అప్పట్లో ఈ పాట సూపర్ హిట్ గా నిలిచింది. అచ్చం శ్రీరామనవమికి గ్రామాల్లో, రామాలయాల్లో జరిగే సందడిని ఈ పాటలో చూపించాడు దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ.

 

 

అత్యంత భారీ ఖర్చుతో ఈ పాట అనేక మంది డ్యాన్సర్లతో నిజమైన పండగ వాతావారణాన్ని తలపించేలా ఈ పాట చిత్రీకరించారు. తమిళనాడు ప్రాంతంలో తెరకెక్కించిన పాటకు భారీగా ఖర్చు పెట్టారు నిర్మాత దేవీవర ప్రసాద్. చిరంజీవి తనదైన డ్యాన్సులతో పాట అందంగా వచ్చేందుకు కృషి చేశారు. ప్రతి పెళ్లి పందిట్లో ఈ పాట ఉండేలా ఈ పాట ఉంటుందని అప్పట్లో చిత్ర బృందం ప్రకటించింది. అన్నట్టుగానే అప్పట్లో ప్రతి పెళ్లి సందట్లో ఈ పాట మోగిపోయింది. ఇప్పటికీ శ్రీరామనవమి పందిట్లో ఈ పాట వినబడుతూ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: