కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాల ఆర్థిక వ్యవస్థను బాగా దెబ్బతీస్తుంది. ఇలా అందర్నీ ఆర్ధికంగా చిన్నాభిన్నం చేస్తున్న కరోనా మహమ్మారి టాలీవుడ్ పరిశ్రమపై కూడా పడి చాలా మందికి తీవ్ర నష్టం కలిగిస్తుంది. కోట్ల రూపాయల బడ్జెట్ తో తీసిన సినిమాలన్నీ రిలీజ్ కాకుండా వాయిదా పడగా... నిర్మాతలంతా తీవ్ర నిరాశలో ఉన్నారు. నాని హీరోగా నటించిన 'వి' సినిమా కూడా కరోనా దెబ్బకి వాయిదా పడింది. మార్చి 25 వ తేదీన దిల్ రాజు ఈ సినిమాని విడుదల చేయాలని ఆశించాడు. హీరో నాని కూడా మార్చి 25 తన సినిమా రిలీజ్ అయితే బాగుంటుందని ఆశించాడు. కానీ కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించగా... అన్ని సినీ థియేటర్లు మూసివేయబడ్డాయి. నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని రూ. 40 కోట్లతో తెరకెక్కించాడు. విడుదల అయితే కాస్తోకూస్తో లాభం చేకూరుతుందని భావించాడు.


పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ సినిమా తీసేందుకు కూడా దిల్ రాజు సిద్ధమయ్యాడు. ఇప్పటికే ఆ సినిమాలో నటించే నటీనటులకు, ఇంకా ఇతర సినీ సిబ్బందికి అడ్వాన్సులు కూడా ఇచ్చేశాడు. మరోవైపు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అయిపోగా.. దిల్ రాజు రూ. 75 కోట్లు వెచ్చించి ఉత్తర ఆంధ్ర, నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులను కొనుగోలు చేశాడు. కానీ కరోనా దెబ్బకి ప్రస్తుతం రాజమౌళి సినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది. షూటింగ్ ప్రారంభమై సినిమా పూర్తయ్యేలోపు చాలా సమయం పడుతుందని... ఒకవేళ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అయినా చూసేందుకు ఎక్కువమంది అభిమానులు రారని... డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోతారని చిత్ర వర్గాలు తెగ చర్చించుకుంటున్నాయి.


దాంతో దిల్ రాజు ఆర్ఆర్ఆర్ చిత్ర నిర్మాత డి.వి.వి.దానయ్య తో మాట్లాడి డీల్ మార్చుకోవాలని... కావాలంటే డిస్ట్రిబ్యూషన్ హక్కులను వదిలేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా 40కోట్ల వి సినిమా యొక్క విడుదల వాయిదా పడటం... బుక్ చేసిన సినీ థియేటర్ యొక్క మూడు కోట్ల రెంట్ ని వట్టి పుణ్యానికి కట్టడం... 200కోట్ల బడ్జెట్ తో తీసే వకీల్ సాబ్ షూటింగ్ అర్థాంతరంగా ఆగిపోవడం... ఆర్ఆర్ఆర్ డిస్ట్రిబ్యూషన్ హక్కులు కొనుక్కొని తాను ఘోరంగా నష్టపోతానన్న భయం ప్రస్తుతం దిల్ రాజు ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోందని సినీ వర్గాల నుంచి సమాచారం. ఒక్క మాటలో చెప్పాలంటే... కోవిడ్ 19 వ్యాధి కారణంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా మునిగింది దిల్ రాజు అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: