అందం అందలం ఎక్కించింది. అద్రుష్టం కూడా జత  కలసింది. ఇంకేం ఆయన ఒక్కసారిగా  వెండితెర వేలుపు అయ్యాడు. ఎంతలా అంటే నాడు అగ్ర నటులు ఎన్టీయార్, ఏయన్నార్ సైతం ఆ నటుడి గురించి వాకబు చేసి జాగ్రత్త పడేటంతగా. తొలి సినిమా సూపర్ హిట్. ఆ తరువాత వెల్లువలా అవకాశాలు. ఓవర్ నైట్ స్టార్ డం. టాలీవుడ్లో రెండవ తరం దూకుడుకి తొలి బీజం వేసిన ఆ నటుడు ఎంత వేగంగా ఎదిగాడో అంత వేగంగానూ పతనం అయ్యాడు.

 

ఇంతకీ ఆ నటుడు ఎవరు అనుకుంటున్నారా. ఆయనే ఆంధ్రా దేవానంద్ గా ప్రఖ్యాతి చెందిన రామ్మోహ‌న్. ఆయన తేనే మనసులు సినిమా ద్వారా తెలుగు చలన చిత్ర సీమకు పరిచయం అయ్యాడు. సరిగ్గా ఇప్పటికి 55 ఏళ్ళ నాడు  ఆ సినిమా అంటే  1965 మార్చి 31న రిలీజ్ అయింది.  పూర్తి రంగుల చిత్రంగా అప్పట్లో సరికొత్త రికార్డులు స్రుష్టించింది. ఆ సినిమాలో  హీరో గురించి షూటింగ్ టైంలోనే ఎక్కువగా అంతా చెప్పుకునే వారు. అలా రామ్మోహన్ ఎంట్రీ తోనే అందరికీ దడ పుట్టించాడు.

 

హైదరాబాద్ లోని బేగంపెట విమానాశ్రయంలో ఇంజనీరుగా మంచి జీతం జీవితంతో గడుపుతున్న వారణాసి రామ్మోహన రావుకి కళారంగం మీద మక్కువ ఎక్కువ. ఆయన అప్పటికే పెళ్ళి అయి పిల్లలు ఉన్నవాడు. ఆ సమయంలో ఆయనలోని నటన సినీ జగత్తు వైపు వెళ్ళే అవకాశం వచ్చింది. విఖ్యాత దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు తన బాబూ  మూవీస్ బ్యానర్ మీద అంతా కొత్త వారితో సినిమా తీయడానికి పత్రికా ప్రకటన ఇచ్చాడు. అది చూసి వెళ్ళిన అందగాడు రామ్మోహన్ని వెంటనే సెలెక్ట్ చేసుకున్నారు.

 

ఇక్క రామ్మోహన్ ఆ సినిమాల్లో తిరుగులేని నటనతో అందరి కంట్లో పడ్డాడు. సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో ఆదుర్తి అదే బ్యానర్ మీద కన్నె మనసులు సినిమాల్లో హీరోగా బుక్ చేశాడు. అది కూడా హిట్టే. ఆ తరువాత ప్రైవేట్ మాస్టర్ తో దశ తిరిగింది. చిత్రమేంటంటే ఈ మూడు సినిమాల్లో ఇప్పటి సూపర్ స్టార్ క్రిష్ణ చిన్న పాత్రలే పోషించాడు. 

 

అలా వెలిగిపోతున్న రామ్మోహన్ వ్యసనాల బారిన అతి తక్కువ కాలంలోనే చిక్కుకున్నాడు. అంతే ఆ తరువాత ఆయన షూటింగులకు ఆలస్యంగా రావడంతో  పాటు మద్యం అలవాటు వల్ల నటనలో టాలెంట్ చూపించకపోవడంతో ఆయనకు అడ్వాన్సులు ఇచ్చిన వారే వెనక్కి తీసుకున్నారు. 

 

చివరికి చిన్న పాత్రలు వేసుకుంటూ అవి కూడా లేక ఆర్ధికంగా అన్ని రకాలుగా చితికిపోయి తిరిగి హైదరాబాద్ చేరుకున్నాడు. అక్కడ ఒక సైకిల్ షాప్ లో చిన్న పనికి కుదిరాడు ఒకనాటి ఆంధ్రా దేవానంద్. అమ్మాయిల కలల రాకుమారుడు. అక్కడ పని చేస్తున్న మద్యం వ్యసనం మానలేదు. చివరకి 1985 ప్రాంతలో ఆయన చాలా దీనవస్థల్లో కటిక పేదగా  కన్నుమూశారు.  ఒక ఇంజనీరు, ఒక అందాల హీరో ఇలా చివరికి పతనం అయ్యాడు. ఇది కన్నీటి గాధే మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: