కరోనా ని తరిమికోడదాము అంటూ నిన్నరాత్రి భారత జాతి యావత్తు సమర దీపాన్ని వెలిగించినా కరోనా కరాళ నృత్యం కొనసాగుతూనే ఉంది. నిన్న కేవలం ఒక్కరోజున తెలంగాణ రాష్ట్రంలో 62 కేసులు నమోదు అయితే ఇక ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాపిస్తున్న తీరు కలవర పాటుకు గురిచేస్తోంది. మధ్యప్రదేశ్ లో కరోనా సోకిన ఒకవ్యక్తి ఇచ్చిన విందుకు 26 వేలమంది వచ్చారు అని వస్తున్న వార్తలను బట్టి ప్రస్తుతం మనం ఎన్ని దీపాలు వెలిగించినా కరోనా తనపని తాను చాలవేగంగా నిర్వర్తిస్తూ దేశాన్ని కుదిపేస్తోంది. 


ఈపరిస్థితులు ఇలా కొనసాగుతుంటే అసలు ఈసమస్యల నుండి బయటపడి ధియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయో ఇండస్ట్రీలో తలలు పండినవారికి కూడ అర్ధంకాని విషయంగా మారింది. ఇలాంటి పరిస్థితులలో మనహీరోల పరిస్థితి పూర్తి అయోమయంలో పడిపోయింది. మిడిల్ రేంజ్ హీరోలు అయిన నాని నితిన్ నాగచైతన్య నిఖిల్ లాంటి వాళ్ళు సంవత్సరానికి కనీసం మూడు సినిమాలు నటించాలి అని ప్లాన్ చేసుకుంటే కనీసం వీరిదగ్గర నుండి రెండు సినిమాలు అయినా వస్తాయా అన్న అయోమయం కొనసాగుతోంది. 


కరోనా వల్ల పూర్తిగా చిరంజీవి లెక్క తప్పింది. తన ‘ఆచార్య’ మూవీని 100 రోజులలో పూర్తిచేయాలి అని చిరంజీవి భావిస్తే ఈమూవీ పూర్తి కావడానికి ఇంకా ఎన్నివందల రోజులు పడతాయో ఎవరికీ తెలియని విషయంగా మారింది. ఇక జూనియర్ చరణ్ ల పరిస్థితి మరింత ఘోరం ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ కరోనా దెబ్బతో వచ్చేఏడాది సంక్రాంతికి రావడం కష్టం అన్నఅభిప్రాయలు వ్యక్తం అవుతూ ఉండటంతో వారి కొత్త సినిమాల ప్రాజెక్ట్స్ అయోమయంలో పడిపోయాయి. ఇక ప్రభాస్ అల్లు అర్జున్ ల పరిస్థితి ఇలాగే ఉంది. ప్రభాస్ జిల్ రాథాకృష్ణల మూవీ ఎప్పటికి పూర్తి అవుతుందో ప్రభాస్ కు కూడ క్లారిటీ లేదు. ఇక సుకుమార్ అల్లు అర్జున్మూవీ ప్రారంభం కావడానికి మరొక మూడు నెలలు పట్టినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. 


రాజకీయాల నుండి సినిమాల వైపు యూటర్న్ తీసుకుని నటిస్తున్న పవన్ ఉత్సాహం కూడ కరోనా దెబ్బతో నీరు కారిపోయింది అని అంటున్నారు. ఈలిస్టులో మహేష్ కు కూడ ఎటువంటి మినహాయింపు లేదు. వీళ్లతో పాటు సీనియర్స్ అయిన బాలకృష్ణ బోయపాటి సినిమా వెంకటేశ్ ‘నారప్ప’ మూవీ నాగార్జున ‘వైల్డ్ డాగ్’ సినిమాల షూటింగ్స్ కూడా నిరవథికంగా వాయిదాపడ్డాయి. ఇలా ఒకరిద్దరు కాదు టాలీవుడ్ కు చెందిన దాదాపు హీరోల ప్లాన్స్ అంతా తారుమారు అయిపోయింది. ఇలాంటి పరిస్థితులలో నిర్మాతలు ఇక హీరోల డేట్స్ కోసం భారీ పారితోషికాలు ఇచ్చి తిరిగే రోజులు కరోనా దెబ్బతో పోయాయి అంటూ ఇండస్ట్రీ వర్గాలు ఇండస్ట్రీ పరిస్థితి పై నిట్టూర్పులు విడుస్తున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: