మాస్ మహారాజా రవితేజ ఈ మధ్య ఆశించిన స్థాయిలో హిట్ అనుకోలేకపోతున్నాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన రవితేజ గత చిత్రం 'డిస్కోరాజా' బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. అయినా సరే సినిమాల స్పీడ్ ను మాత్రం పెంచుతూనే ఉన్నాడు. రవితేజ ప్రస్తుతం కెరీర్లో 66వ చిత్రంగా తెరకెక్కుతున్న 'క్రాక్' మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ వరలక్ష్మీ శరత్ కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. డాన్‌ శీను, బలుపు లాంటి సినిమాలతో ఆకట్టుకున్న రవితేజ, గోపిచంద్‌ మలినేనిలు హ్యాట్రిక్‌ హిట్ కోసం రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు రవితేజ. ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేయబోతున్నారని సమాచారం.

 

కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం, రవితేజ్ చేస్తోన్న రెండు పాత్రల్లో ఒక పాత్ర చార్టర్డ్ అకౌంటెంట్ అట, అలాగే మరో పాత్ర ఎన్ఆర్ఐ బిజినెస్ మెన్ పాత్ర అట. బిజినెస్ మెన్ పాత్ర కూల్ గా ఉంటే.. చార్టర్డ్ అకౌంటెంట్ పాత్ర పక్కాగా మాస్ పాత్ర అట. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ ను ఫైనల్ చేసిన చిత్రబృందం, అలాగే మరో హీరోయిన్ గా మాళవిక శర్మను తీసుకోనున్నారని సమాచారం. గతంలో 'నేల టిక్కెట్టు' సినిమాలో మాళవిక రవితేజ సరసన నటించింది. అయితే ఈ సినిమా రీమేక్ అని వార్తలు వస్తున్నాయి. తమిళంలో అరవింద స్వామి, త్రిష కలయికలో రానున్న ‘శతురంగ వెట్టై 2’ చిత్రాన్నే తెలుగులో రవితేజ చేయబోతున్నాడని ఆ వార్తల సారాంశం. అయితే ఈ వార్తకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈ చిత్రాన్ని కోనేరు సత్యనారాయణ నిర్మించనున్నారు. మరి ఈ వరుస సినిమాల ద్వారా రవితేజ బ్యాక్ తో బ్యాక్ హిట్లు కొట్టి పూర్వ వైభవాన్ని తీసుకొస్తాడేమో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: