అఖిల్.. నడవడం, మాట్లాడటం రాని రోజుల్లోనే హీరో అయ్యాడు. తన బోసి నవ్వులతో, అల్లరి చేష్టలతో తెలుగు ప్రేక్షకుల మనసులో 'సిసింద్రీ'గా చెరగని ముద్ర వేసుకున్నాడు. అక్కినేని మూడో తరం నట వారసుడిగా 'అఖిల్' సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు అఖిల్ అక్కినేని. ఆ సినిమా ఆశించినంత విజయం సాదించనప్పటికీ అఖిల్ స్క్రీన్ ప్రెజన్స్ కి మంచి మార్కులే పడ్డాయి. ఫస్ట్ సినిమాతోనే తన డాన్సులతో ఫైట్స్ తో అదరగొట్టేసాడు. ఆ తర్వాత అక్కినేని ఫ్యామిలీకి 'మనం' లాంటి చిత్రాన్ని అందించిన విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో రెండో సినిమాగా 'హలో' చిత్రంలో నటించాడు. ఈ సినిమా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చినప్పటికీ మాస్ ఆడియన్స్ కోరుకొనే ఎలిమెంట్స్ లేకపోవడంతో సెన్సిబుల్ సినిమాగా మిగిలిపోయింది. మూడో సినిమాగా వచ్చిన మిస్టర్ మజ్ను కూడా అఖిల్ ని నిలబెట్టలేకపోయింది. అఖిల్ బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎంత ప్రయత్నించినా ఆ ఒక్కటి మాత్రం రావడం లేదు. టాలెంటెడ్ ద‌ర్శ‌కుల‌తో ప‌ని చేసినా కూడా.. సినిమాల‌కు పాజిటివ్ టాక్ వ‌చ్చినా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు సూపర్ హిట్ మాత్రం రాలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు నాలుగో సినిమాను డైరెక్ట‌ర్‌ బొమ్మరిల్లు భాస్కర్ తో చేస్తున్నాడు అఖిల్. దాదాపు తెలుగు ప్రేక్ష‌కులు అంతా మ‌రిచిపోయిన బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్' సినిమా చేయ‌బోతున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్, వాసు వర్మ నిర్మించనున్నారు. అల్లు అరవింద్ సమర్పకులుగా వ్యవహరిస్తారు. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. 

 

ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా ఏప్రిల్ లో విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. కానీ కరోనా వైరస్ నేపథ్యంలో చిత్ర షూటింగులు నిలిచిపోవడంతో ఈ సినిమా ఇప్పుడల్లా కంప్లీట్ అయ్యేలా కనిపించడం లేదు. ఈ చిత్రంలో ఇంకా కొన్ని సాంగ్స్, ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించాల్సి ఉంది. ప్రస్తుత కరోనా పరిస్థితులు చూస్తే షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యేది కూడా చెప్పలేని పొజిషన్. అన్నీ అనుకున్నట్లు జరిగితే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్' సినిమా జూన్ లేదా జులై నెలలో విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా సూపర్ హిట్ కోసం ఆకలి మీదున్న అఖిల్ కరోనా కారణంగా మంచి సీజన్ మిస్సయ్యాడని చెప్పవచ్చు. కానీ ఈ సినిమా ద్వారా సూపర్ హిట్ కొడతాడని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. అక్కినేని నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న తండ్రి నాగార్జున, అన్న నాగచైతన్యలకు ఏమాత్రం తీసిపోని నటన అఖిల్ సొంతం. రాబోయే రోజుల్లో అక్కినేని లెగసీని అఖిల్ కంటిన్యూ చేస్తాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక సరైన సినిమా పడితే అఖిల్ మళ్ళీ వెహుడిరి చూసుకునే పరిస్థితి రాదని కచ్చితంగా చెప్పగలం. ఏదేమైనా ఇక ముందు అఖిల్ అక్కినేనికి అన్నీ మంచి రోజులే ఉండాలని కోరుకుంటూ బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నాం. 

 

అయితే ఏప్రిల్ 8న అఖిల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా తన సినిమా గురించి ఏదైనా పోస్టర్ టీజర్ విడుదల చేస్తారేమో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కానీ అఖిల్ సోషల్ మీడియా ద్వారా వీడియో రూపంలో స్పందిస్తూ.. రేపు పుట్టినరోజున ఎలాంటి పోస్టర్ టీజర్ రిలీజ్ చేయట్లేదని తెలిపాడు. అంతేగాక ఫ్యాన్స్ అందరూ కూడా ఎవరి ఇళ్లలో వారుండి ఆరోగ్యంగా ఉండాలని కోరారు. ఈ విషయం తెలిసి అఖిల్ అభిమానులు నిరాశ చెందుతున్నారు. కానీ చివరగా ఫ్యామిలీతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని - మీరు కూడా మంచి ఫ్యామిలీ ఫోటోను పోస్ట్ చేయండని ఫ్యాన్స్ కి పిలుపునిచ్చాడు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: