రజినీకాంత్, ఐశ్వర్యరాయ్ హీరో హీరోయిన్లగా నటించిన రోబో సినిమా విడుదలై ఇప్పటికి 10 సంవత్సరాలు కావస్తోంది. ఆ సినిమా తమిళ ఇండస్ట్రీలో అన్ని రికార్డులను బద్దలు కొట్టిందని చెప్పుకోవచ్చు. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రోబో సినిమా రూ.195 కోట్లు వసూలు చేసిందంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ సినిమా ఆడియో ఫంక్షన్ లో రజనీకాంత్ ఒక హాస్యాస్పదమైన సంఘటన గురించి చెప్పి అందరినీ కడుపుబ్బా నవ్వించాడు.


సౌత్ ఇండస్ట్రీ లో సూపర్ డూపర్ క్రేజ్ ని సంపాదించిన రజినీకాంత్... అత్యంత అందమైన బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్ కలిసి రోబో సినిమాలో నటించడం అభిమానులకు ఓ పెద్ద వరమని చెప్పుకోవచ్చు. కానీ ఓ రాజస్థాన్ వ్యక్తి మాత్రం బట్టతల ఉన్న రజినీకాంత్ తో ఐశ్వర్య రాయ్ నటించడమేంటని తెగ ఆశ్చర్యపోయాడట. ఈ విషయాన్ని మలేషియా లో నిర్వహించిన రోబో చిత్ర ఆడియో ఫంక్షన్ లో సాక్షాత్తు రజినీకాంతే చెప్పాడు. తాను ఒక రోజు బెంగళూరులోని తన సోదరుడి ఇంటికి వెళ్లానని... ఆ ఇంటి పక్కనే అద్దెకు ఉంటున్న నందూలాల్ అనే ఓ 60 ఏళ్ల వ్యక్తి తనను చూసేందుకు వచ్చాడని అప్పుడు ఈ కింది విధంగా సంభాషణ కొనసాగిందని చెప్పాడు.


నందూలాల్: ఏంటయ్యా రజినీకాంత్, మీ జుట్టు కి ఏమైంది?

రజనీకాంత్: నా జుట్టు ఎప్పుడో ఊడిపోయింది, దాని గురించి వదిలేయండి.

నందూలాల్: మీరు మీ రిటైర్డ్ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారా?

రజినీకాంత్: లేదండి. ప్రస్తుతం నేను ఒక సినిమాలో నటిస్తున్నాను.

నందూలాల్: ఏంటీ, మీరు సినిమాలో నటిస్తున్నారా? ఇంతకీ ఆ సినిమా ఏంటో?

రజినీకాంత్: రోబో. ఆ సినిమాలో ఐశ్వర్యరాయ్ హీరోయిన్ గా నటిస్తుంది.

నందూలాల్: వావ్!! ఐశ్వర్య రాయ్, హా? ఆమె మాములు అందగత్తె కాదండోయ్. అవును మరీ, ఇంతకీ హీరో ఎవరండీ?

రజినీకాంత్: (చెప్పాలా వద్దా అన్నట్టు ఆలోచిస్తూ) ఆ సినిమాలో హీరో నేనే, అండీ.

నందూలాల్: ( ఓ పదినిమిషాల పాటు రజినీకాంత్ ని తదేకంగా చూస్తూ) అచ్చా, మీరు హీరో ఏంటండీ బాబు? చెవిలో పూలు పెడుతున్నారా?


అని తాను రజనీకాంత్ ని ప్రశ్నించగానే తన కుమారుల వెంటనే వచ్చి... 'నాన్న, రజనీకాంత్ ఇప్పటికీ హీరో పాత్రలలోనే నటిస్తున్నారు. ఇక చాలు ఇంటికి వెళ్దాం పద' అంటూ ఆయన్ని ఇంటికి తీసుకు పోయారు.


అయితే ఈ సంభాషణ తర్వాత రజనీకాంత్ తన సోదరుడి ఇంట్లో పదిరోజులపాటు ఉన్నప్పటికీ... నందూలాల్ మాత్రం తన వైపు చూసాడే తప్ప ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ చివరగా ఒక రోజు నందూలాల్ తన కుమారులతో మాట్లాడుతూ... అరే, ఐశ్వర్య రాయ్ కి అసలు ఏమైంది? అభిషేక్ బచ్చన్ ఎక్కడికి వెళ్లి పోయాడు? అమితాబచ్చన్ ఏం చేస్తున్నాడు? బట్టతల ఉన్న రజినీకాంత్ కి ఐశ్వర్య రాయ్ తో నటించే అవకాశం ఎలా వచ్చింది? అంటూ ప్రశ్నించాడట. ఇదంతా రజనీకాంత్ ఆడియో ఫంక్షన్ లో చెబుతుంటే అక్కడికి విచ్చేసిన వారంతా పగలబడి నవ్వారు. ఈ సందర్భంగా ఐశ్వర్యారాయ్ ఉద్దేశిస్తూ... నా పక్కన హీరోయిన్ గా నటించేందుకు అంగీకరించిన మీకు నా ధన్యవాదాలు' అంటూ రజనీకాంత్ తన ప్రసంగాన్ని ముగించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: