ప్రస్తుతం ఏ దేశం చూసినా, ఎక్కడి ప్రజల్ని చూసినా కూడా అందరూ ఈ మాయదారి కరోనా దెబ్బకి అల్లల్లాడుతున్నారు. అయితే ఈ వ్యాధి తీవ్రతను ముందుగా గుర్తించిన పలు దేశాలు ఇప్పటికే ప్రజలను పూర్తిగా ఇళ్లకు పరిమితం చేస్తూ లాకౌట్ లు ప్రకటించిన విషయం తెలిసిందే. మన దేశంలో కూడా ఇప్పటికే 21 రోజుల పాటు లాకౌట్ ని ప్రకటించి ప్రధాని మోడీ, ప్రజలు ఎవ్వరూ కూడా ఇళ్ల నుండి బయటకు రావద్దని, ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చినపుడు మాత్రమే బయటకు రావాలని కోరడం జరిగింది. ఇక ఈ మహమ్మారి మరింతగా వ్యాప్తి కాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ తప్పకుండా డాక్టర్లు సూచించిన జాగ్రత్తలు పాటించాలని పలువురు అధికారులు కోరుతున్నారు. 

 

ఇకపోతే ఈ కరోనా ఎఫెక్ట్ తో ఎందరో పేద వారికి పనులు లేక, తినడానికి సరైన తిండి లేక నానా అవస్థలు పడే పరిస్థితులు రావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారిని ఆదుకోవడానికి కొంత మొత్తాన్ని ఆర్ధిక సాయంగా ప్రకటించగా, అటువంటి వారిని ఆదుకునేందుకు పలు రంగాలకు చెందిన ఎందరో ప్రముఖులు ముందుకు వస్తూ తమకు తోచిన సాయాన్ని అందిస్తున్నారు. ఇక మన టాలీవుడ్ నుండి ఇప్పటికే పలువురు విరాళాలు అందించగా, నట ప్రపూర్ణ మంచు మోహన్ బాబు ఫ్యామిలీ చిత్తూరు జిల్లా చంద్రగిరి లోని ఎనిమిది గ్రామాలలోని ప్రజలకు నిత్యం రెండు పూటలా భోజనం అందించడంతో పాటు వారందరికీ నిత్యం ఎనిమిది టన్నుల కూరగాయలు కూడా అందిస్తున్నారు. ఇక ఇంతటి గొప్ప సాయం చేస్తున్న మోహన్ బాబు, నిన్న ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు. 

 

ప్రస్తుతం ఈ కరోనా మహమ్మారి దెబ్బకు విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రజలకు తనకు దేవుడు ఇచ్చిన దానిలో కొంత అందివ్వాలని ఉద్దేశ్యంతో తమ కుటుంబం మొత్తం కూడా ముందుకు వచ్చిందని అన్నారు మోహన్ బాబు. తన బిడ్డలు విష్ణు, మనోజ్, లక్ష్మి అందరూ కూడా తమ సంస్థల్లో, కార్యాలయాల్లో పని చేస్తున్న వారిని, ముఖ్యంగా వలస వచ్చిన వారిని అన్ని విధాలా ఆదుకునేందుకు తగు చర్యలు తీసుకుంటున్నారని, వారికి భోజనం అందించడంతో పాటు వీలైన ధన సహాయం కూడా చేస్తున్నాం అని మోహన్ బాబు అన్నారు. 

 

నిజానికి ప్రపంచానికి వచ్చిన ఇటువంటి పరిస్థితి గడచిన వందేళ్లలో ఎప్పుడూ రాలేదని, అయితే ఇటువంటి దుర్భరమైన పరిస్థితికి కారణం మనిషి, ముఖ్యంగా కొందరు మనుషుల్లో ఉన్న అహంకారం, కుల జాడ్యం, స్వార్ధ చింతనలు అని మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేసారు. రాను రాను మనిషి వీటిని పెంచుకుంటూ పోతున్నాడు, అందువల్లనే ఆ భగవంతుడే మన మీదకు ఇటువంటి అస్త్రాలు వదులుతున్నాడని, ఎంతటి వాడైనా ఏదో ఒకరోజు మట్టిలో కలిసిపోవలసిందే అనే నగ్న సత్యాన్ని మరిచి ప్రస్తుతం మనిషి జీవిస్తున్నాడని, కావున ఇకనైనా మనుషుల్లో మార్పు వచ్చి మంచి, మానవత్వం, దయా గుణం వంటివి పెంపొందించుకుంటే తప్పకుండా మనందరికీ మంచి రోజులు వస్తాయని, రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు మోహన్ బాబు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: