ఈ ఏడాది ప్రారంభంలో 'అల వైకుంఠపురంలో' సినిమాతో మంచి హిట్ కొట్టిన అల్లు అర్జున్ అదే ఊపుతో స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ తో సినిమా పట్టాలెక్కించేసాడు. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టైటిల్‌ను ప్రకటించారు. ఈ చిత్రానికి 'పుష్ప' అనే టైటిల్ ఖరారు చేసి ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు చిత్ర బృందం. ఈ పోస్టర్‌లో అల్లు అర్జున్ ఊర మాస్ లుక్‌లో అదరగొట్టారు. రాయలసీమకు చెందిన మొరటు కుర్రాడిగా బన్నీ డీగ్లామర్ లుక్ కేక పుట్టిస్తుంది. మాసిన గెడ్డం మీసాలతో సీరియస్‌గా ఉన్న బన్నీ లుక్ చాలా కొత్తగా ఉంది. అలాగే ఆయన వేసుకున్న షర్ట్ కూడా పాత స్టైల్లో ఉంది. ‘పుష్ప' ఫస్ట్ లుక్ పోస్టర్లకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఒక పోస్టర్ లో బన్నీ లుక్‌ను మాత్రమే చూపించిన సుకుమార్.. రెండో పోస్టర్‌లో మాత్రం గంధపు చెక్కలు స్మగ్లింగ్ చేస్తుండగా పట్టుబడినట్లు చూపించాడు. అంతేకాదు, ఆ పోస్టర్‌లో బన్నీ కాలికి ఆరు వేళ్లు ఉండడం హాట్ టాపిక్ అవుతోంది. అలాగే టైటిల్‌పై ఉన్న వేలిముద్రలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కెరీర్ తొలినాళ్లలో ‘ఆర్య' అనే సినిమా ద్వారా బన్నీకి సూపర్ హిట్ అందించాడు డైరెక్టర్ సుకుమార్. ఆ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ‘ఆర్య2' కూడా వచ్చింది. ఈ సినిమా వచ్చిన పదేళ్ల తర్వాత బన్నీ - సుకుమార్ కాంబో మూడో సినిమాగా 'పుష్ప' తెరకెక్కుతోంది.

 

బన్నీని ప్రతీ సినిమాలో కొత్తగా ప్రజెంట్ చేసిన సుక్కు ఈ సినిమాలో కూడా వైవిధ్యంగా చూపించాడు అని తెలుస్తుంది. శేషాచలం అడవుల్లో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుందని ఈ పోస్టర్ల ద్వారా స్పష్టమయింది. ఇక ఈ మూవీ పాన్ ఇండియా మూవీగా తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషలలో విడుదల కానుంది. ఈ చిత్రంతో బన్నీ బాలీవుడ్ లో అడుగుపెట్టనున్న నేపథ్యంలో క్యాస్టింగ్ కూడా భారీగా పలు పరిశ్రమలకు చెందినవారిని తీసుకోవాలని అనుకుంటున్నారట.

 

ఈ మూవీలో విలన్ గా బాలీవుడ్ నుండి తీసుకుకొనే ఆలోచనలో ఉన్నాడట సుకుమార్. ముఖ్యంగా ఆయన సీనియర్ హీరోలు అయిన సంజయ్ దత్, సునీల్ శెట్టి లేదా జాకీ ష్రాఫ్ లలో ఎవరినో ఒకరిని ఒప్పించి తీసుకోవాలని అనుకుంటున్నారట. తమిళ నటుడు విజయ్ సేతుపతి ఈ చిత్రంలో ఓ కీలక రోల్ చేస్తుండగా ఆయన పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని తెలుస్తుంది. లెక్కల మాస్టర్ సుకుమార్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్, ముత్యంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో బ‌న్నీకి జోడీగా లక్కీ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్న న‌టిస్తోంది. ఈ సినిమాకు సుక్కు ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: