దేశంలో కరోనా వేగంగా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం వరకు ఏపీలో 417 కేసులు నమోదు కాగా తెలంగాణలో 504 కేసులు నమోదయ్యాయి. రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య పెరుగుతోంది. కరోనాకు వ్యాక్సిన్ లేకపోవడంతో సామాజిక దూరం ద్వారా వైరస్ ను కట్టడి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. లాక్ డౌన్ వల్ల ఎప్పుడూ షూటింగ్ లతో బిజీగా ఉండే సెలబ్రిటీలు ఇళ్లకే పరిమితమయ్యారు. 
 
కొందరు ఛానళ్లకు, పత్రికలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రముఖ న్యూస్ చానల్ లో ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ ఇంటర్వ్యూలో మోహన్ బాబు కులాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రెండే కులాలు ఉన్నాయని అవి పాజిటివ్ నెగిటివ్ అని చెప్పారు. పదవీ అహంకారంతో జీవిస్తున్న వాళ్లు ఎవరైనా ఈ విషయం గుర్తించి అర్థం చేసుకుంటే చాలని జీవితాంతం గొప్పగా ఉంటారని అన్నారు. ఎవరైనా సరే ఈ విషయం తెలుసుకోవడానికే వచ్చిందే కరోనా అని చెప్పారు. 
 
బాంబ్ వేస్తే ఒక క్షణంలో చచ్చిపోతామని... కరోనా వల్ల ప్రతి నిమిషం చస్తూ బ్రతుకుతున్నామని చెప్పారు. ఎంత జాగ్రత్తగా ఉన్నా కరోనా ఏ క్షణం ఎవరికి సోకుతుందో ఎవరూ చెప్పలేమని అన్నారు. కరోనా తల్లీబిడ్డలు, భార్యాభర్తల మధ్య గ్యాప్ పెంచిందని ఇంతకు మించిన శిక్ష ఇంకేం ఉంటుందని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరూ ఇకనుంచైనా మారాలని సూచించారు. 
 
మోహన్ బాబు కులాల గురించి, కరోనా గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మోహన్ బాబు చెప్పిన ప్రతి మాట అక్షర సత్యమని నెటిజెన్లు కామెంట్ల రూపంలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొందరు మాత్రం మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలపై నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: