రాజమౌళి... భారతీయ సినీ చరిత్రలోనే వరుస సక్సెస్ లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకధీరుడు. బాహుబలి సిరీస్ సినిమాలతో టాలీవుడ్ సినిమా గొప్పదనాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకుడు. బాహుబలి, ఈగ మినహా రాజమౌళి మాస్ మసాలా కమర్షియల్ సినిమాలనే ఎక్కువగా తెరకెక్కించాడు. ఈగ, బాహుబలి సినిమాలు కల్పిత కథలే. కానీ రాజమౌళి తొలిసారి చరిత్రకు సంబంధించిన కథతో ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. 
 
అల్లూరి సీతారామరాజు, కొమరం భీo పాత్రలతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై చరిత్రకారుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చరిత్ర ప్రకారం అల్లూరి సీతారామరాజు, కొమరం భీం కలిసిన దాఖలాలు లేవు. కొమరం భీం అదిలాబాద్ అడవుల్లో విప్లవాగ్నులు రగిలించిన స్వాతంత్ర సమరయోధుడు. భీం నిజాంపై పోరాటం చేశాడు. అల్లూరి సీతారామరాజు విశాఖ మన్యంకు చెందిన వీరుడు. ఆయన బ్రిటిషర్లపై పోరాటం జరిపాడు. 
 
దాదాపు సమకాలీనులే అయినప్పటికీ ఇద్దరి చరిత్రలపై ఇప్పటికే తెరకెక్కిన సినిమాల్లో కూడా ఒకరికి ఒకరు పరిచయం ఉన్నట్టు ఎటువంటి ఆధారాలు లేవు. రాజమౌళి సీతారామరాజు, భీం పాత్రలతో కల్పిత గాథనే తెరకెక్కిస్తున్నానని చెప్పినప్పటికీ చరిత్రను అపహాస్యం చేస్తున్నట్టుగానే భావించాల్సి వస్తుంది. ఇద్దరు స్వాతంత్ర సమరయోధుల చరిత్రను రాజమౌళి అపహాస్యం చేస్తున్నారని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. 
 
కొన్ని రోజుల క్రితం నాగబాబు ఆర్ఆర్ఆర్ సినిమా గురించి మాట్లాడుతూ సీతారామరాజు మన్యం ప్రాంతాల్లో, భీం తెలంగాణ అడవుల్లో యుద్ధాలు చేసిన వారని.... ఇద్దరూ సమకాలీనులు అవునో కాదో తనకు కూడా తెలీదని అన్నారు. మరి విప్లవ వీరుల కథను చరిత్ర అపహాస్యం కాకుండా రాజమౌళి తెరకెక్కిస్తున్నారా...? లేదా...? తెలియాలంటే మాత్రం సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే. 2021 జనవరి 8వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. దాదాపు 450 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: