కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఈ మహమ్మారి నుండి తమని తాము కాపాడుకోవడానికి ఇళ్లలోనే ఉండిపోతున్నారు. తన లక్షణాలని మార్చుకుంటూ మన మీద ప్రభావం చూపిస్తున్న ఈ వైరస్ కి ఇంకా మందు కనుక్కోబడలేదు. చైనా నుండి వచ్చిందని చెప్పబడుతున్న ఈ వైరస్ ప్రపంచ దేశాలన్నింటికీ వణికిస్తోంది. వైరస్ దెబ్బకు అగ్రరాజ్యమైన అమెరికా గిలగిలా కొట్టుకుంటోంది.

 

అమెరికా పరిస్థితే ఇలా ఉంటే, చిన్న చిన్న దేశాలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ వైరస్ వల్ల ఉపాధి లేక ఆర్థికంగా చితికిపోతున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని రోజువారి కూలీల పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైంది. వీరి బాధలు తీర్చడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నప్పటికీ, ప్రతీ ఒక్కరి వద్దకి తన చేతులని తీసుకెళ్లలేకపోతుంది. అందుకే చేయూతనందించే పెద్ద మనుషులు వీరికి అండగా నిలుస్తున్నారు.

 

సినీ కార్మికుల కోసం చిరంజీవి నేతృత్వంలో కరోనా క్రైసిస్ ఛారిటీ పేరుతో విరాళాలు సేకరించి రోజువారి కూలీలకి కావాల్సిన అవసరాలను తీరుస్తున్నారు. ఈ ఛారిటీకి చాలా మంది నటీనటులు స్పందించారు. అయితే సినిమా వారి కష్టాలను తీరుస్తున్నారు సరే, మరి నాటకాలు వేసే వాళ్ల పరిస్థితి ఏంటి..? మామూలు రోజుల్లోనే వీరి ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా ఇప్పుడు లాక్డౌన్ సమయంలో నాటకాలు లేక వారి పరిస్థితి దయనీయంగా మారింది.

 

అలాంటి వారికి అండగా నిలబడడానికి గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ముందుకు వచ్చాడు. వారికి కావాల్సిన నిత్యవసరాల వస్తువులను పంపి తనకి నాటకాల మీద అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా స్పందించిన హరీష్, కష్టకాలంలో వారిని ఆదుకోవడం నా బాధ్యత అన్నాడు. ఇక్కడ విశేషమేమిటంటే డైరెక్టర్ అవకముందు హరీష్ శంకర్ చాలా నాటకాలు వేసాడట. నాటకాల్లోనే మునిగి తేలడంతో అందరూ  నాటకాల రాయుడు అని పిలిచేవారట.

మరింత సమాచారం తెలుసుకోండి: