కరోనా లాక్ డౌన్ తో జనం టివి లను చాలఎక్కువగా చూస్తున్న పరిస్థితులలో టివి లలో ప్రసారం అయ్యే అనేక కార్యక్రమాలకు విపరీతమైన రేటింగ్ వస్తున్నాయి. ప్రస్తుతం కరోనా సమస్య వల్ల సినిమాలతో పాటు బుల్లితెర షూటింగ్ లు ఆగిపోయినా కేంద్రప్రభుత్వం ఈనెల 20 నుండి పలు మినహాయింపులు ప్రకటించిన పరిస్థితులలో కనీసం వచ్చే మే నెలాఖరకు అయినా సినిమా బుల్లితెర షూటింగ్ లు మళ్ళీ మొదలవుతాయని భావిస్తున్నారు.


ఐపీఎల్ టోర్నమెంట్ శాస్వితంగా వాయిదా పడటంతో బుల్లితెర పై ప్రసారం చేయబడే ‘బిగ్ బాస్’ షోకు ఇక అడ్డంకులు అన్నీ తొలిగిపోవడంతో కనీసం ఈషోను జూలై మొదటి వారం నుండి అయినా మొదలు పెట్టాలని స్టార్ మా యాజమాన్యం భావిస్తోంది. దీనితో ‘బిగ్ బాస్’ సీజన్ 4కు సంబంధించిన టీమ్ ప్రస్తుతం షూటింగ్ లు లేక ఖాళీగా ఉన్న చాలామంది మిడిల్ రేంజ్ సెలెబ్రెటీ లకు ఫోన్స్ చేస్తూ హౌస్ మేట్స్ గా వస్తారా అని అడగడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.


అయితే మిడిల్ రేంజ్ సెలెబ్రెటీలు కూడ ‘బిగ్ బాస్’ టీమ్ నుండి వస్తున్న ఫోన్స్ కు స్పందించక పోవడం స్టార్ మా యాజమాన్యాన్ని ఆశ్చర్య పరుస్తున్నట్లు టాక్. గత సీజన్స్ లో గీత మాధురి శ్రీముఖి లాంటి క్రేజీ సెలెబ్రెటీలు ఈషోలో పాల్గొన్న నేపధ్యంలో అలాంటి స్థాయి ఉన్న మహిళా సెలెబ్రెటీల కోసం బిగ్ బాస్ టీమ్ ప్రయత్నిస్తున్నా ఎవరు స్పందించడం లేదని అంటున్నారు. 


అదేవిధంగా పెద్దగా అవకాశాలు రాకపోవడంతు ప్రస్తుతం ఖాళీగా ఉంటున్న కొంతమంది హీరోలకు గేలం వేయాలని బిగ్ బాస్ టీమ్ ప్రయత్నిస్తున్నా అవకాశాలు లేకుండా ఖాళీగా ఉన్న మిడిల్ రేంజ్ హీరోలు కూడ బిగ్ బాస్ ఫోన్ అంటే భయపడిపోతున్నారు అని అంటున్నారు. దీనికి కారణం గత సీజన్స్ లో ‘బిగ్ బాస్’ షో విన్నర్స్ గా శివ బాలాజీ  కౌశల్ రాహుల్ లాంటి వాళ్ళు బిగ్ బాస్ షో విజేతలుగా మారినా వారికి ఆషో ముగిసిన తరువాత కొన్నిరోజులు క్రేజ్ కొనసాగింది కానీ ఆతరువాత వారికి ఇండస్ట్రీ పరంగా కలిసివచ్చిన అవకాశాలు లేవు. దీనితో ‘బిగ్ బాస్’ హౌస్ లోకి వెళ్ళడం అంటే ఇండస్ట్రీ పరంగా సినిమాలలో పూర్తిగా అవకాశాలు పోగొట్టుకోవడమే అన్న సెంటిమెంట్ ప్రస్తుతం చాలామంది మిడిల్ రేంజ్ సెలెబ్రెటీ లకు కూడ ఉండటంతో వారంతా ప్రస్తుతం బిగ్ బాస్ ఫోన్స్ ను అంతగా పట్టించుకోవడం లేదు అని అంటున్నారు..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: