పటాస్ సినిమాతో దర్శకుడిగా మారి కళ్యాణ్ రామ్ కి విజయాన్నందించిన అనిల్ రావిపూడి మహేష్ బాబుతో చేసిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. మహేష్ తో చేసే అవకాశం ఇచ్చనందుకు కృతజ్ఞతగా సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ పేరు అజయ్ ని తన కొడుకుని పెట్టుకున్నాడు. ఇప్పటి వరకు ఐదు సినిమాలు చేసిన అనిల్ రావిపూడి ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ ని కూడా చవిచూడలేదు. రాజమౌళి , కొరటాల శివ తర్వత ఓటమినెరుగని దర్శకుడిగా దూసుకుపోతున్నాడు.


కొందరు దర్శకులు మాస్ సినిమాలని బాగా తీయగలరు. కొందరు సెంటిమెంట్ చిత్రాలని బాగా తీస్తారు. ఒక్కో దర్శకుడికి ఒక్కో జోనర్ పట్టు ఉంటుంది. అలా అనిల్ రావిపూడికి పట్టు ఉన్న సబ్జెక్టు కామెడీ. మొదటి సినిమా నుండి మొదలు పెడితే మొన్న సరిలేరు నీకెవ్వరు వరకు అనిల్ నమ్ముకున్నది కామెడీనే. జనాల్ని ఎంటర్ టైన్ చేయాలంటే నవ్వించాలి అని బాగా తెలుసుకున్నాడు. టెలివిజన్ విరివిగా కామెడీ అందుతున్నా కూడా జనాల్ని థియేటర్ కి రప్పించే సత్తా అనిల్ సొంతం.

 

అయితే గత రెండు సినిమాల నుండి చూస్తే అనిల్ కామెడీ మరీ ఓవర్ డోస్ అయినట్టు అనిపిస్తుంది. ఎఫ్ ౨ చిత్రంలో మెహ్రీన్ పాత్రగానీ, అలాగే సరిలేరు లో రష్మిక పాత్ర కొంచెం అతిగా అనిపిస్తుంటుంది. నిజజీవితంలో మనం అలాంటి పాత్రలని దాదాపుగా చూడము. అందుకే జనాలు వాటికి రిలేట్ కాలేకపోయారు. సినిమాలు హిట్ అయినా కూడా ఆ పాత్రల్ని విమర్శించారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్ ౩ స్క్రిప్ట్ పనుల్లో ఉన్నాడట.

 

అందులోనూ మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తుందని, ఎఫ్ ౨ మాదిరిగానే ఎఫ్ ౩ లోనూ ఆమె పాత్ర స్వభావం అలాగే ఉంటుందని అంటున్నారు. ఎఫ్ ౨ వచ్చిన సమయంలో బాక్సాఫీసు వద్ద సినిమాలేమీ లేకపోవడం బాగా కలిసొచ్చింది. ప్రతీ సారి అలా కుదరకపోవచ్చు. అందువల్ల అనిల్ రావిపూడి తన పద్దతిని మార్చుకోవాలని అంటున్నారు. మరీ అతిగా అనిపించే పాత్రలని పక్కనపెట్టి న్యూ ఏజ్ కామెడీతో ముందుకు వస్తే బాగుంటుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: