కరోనా వైరస్ కారణంగా అన్ని వ్యవస్థలతో పాటు తెలుగు సినీ పరిశ్రమ కూడా స్తంభించిపోయింది. షూటింగ్స్ వాయిదా పడడంతో హీరోల నుంచి పరిశ్రమలోని కార్మికుల వరకూ ఇళ్లకే పరిమితమైపోయారు. రోజువారీ ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులకు చిరంజీవి ఆధ్వర్యంలో సీసీసీ మనకోసం అనే సంస్థ ఏర్పాటైన విషయం తెలిసిందే. ఈ సంస్థ ద్వారా కార్మికులకు అందుతున్న సాయానికి ఈనాడు గ్రూప్ చైర్మన్ రామోజీరావు సైతం స్పందించారు. ఇటివల రెండు తెలుగు రాష్ట్రాలకు 20 కోట్లు విరాళం ప్రకటించిన రామోజీరావు ఇప్పుడు సినీ పరిశ్రమ కోసం ముందుకొచ్చారు.

 

 

సీసీసీ కి ఈనాడు గ్రూప్ తరపున 10లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించారు. రామోజీ సాయంపై చిరంజీవి స్పందించారు. ‘సినీ పరిశ్రమతో వెలకట్టలేని అనుబంధమున్న రామోజీ రావు స్పందించి తన దాతృత్వాన్ని చాటుకోవడం శుభపరిణామం. ఈ ఆపత్కాలంలో సినీ కార్మికులను ఆదుకోవడం కోసం తన వంతు సాయం చేయడం అభినందనీయం. వ్యక్తిత్వంలో మీరు శిఖర సమానం’ అంటూ చిరంజీవి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అభినందనలు తెలిపారు. రామోజీ ఫిలింస్ బ్యానర్ పై 85కు పైగా సినిమాలు నిర్మించారు రామోజీరావు. ఎన్నో సినిమాలను పంపిణీ చేశారు. ఆసియా ఖండంలోనే అత్యంత అధునాతనమైన ఫిలిం సిటీని నిర్మించారు.

 

 

కరోనా విపత్తు నుంచి కోలుకుని షూటింగ్స్ ప్రారంభమయ్యేది ఎప్పటికో అనే ప్రశ్న ఇండస్ట్రీ వర్గాలకే పెద్ద ప్రశ్నగా మారింది. ఈ సమయంలో రోజువారీ వేతనాలపై ఆధారపడ్డ సినీ కార్మికుల ఉపాధి కోసం మెగాస్టార్ చిరంజీవి ముందుకొచ్చి ‘సీసీసీ మనకోసం’ అనే సంస్థను ఏర్పాటు చేసి వారికి నిత్యావసరాలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సంస్థకు సినీ సెలబ్రిటీల నుంచి విరాళాల రూపంలో ఇప్పటికే 8కోట్ల రూపాయలు వరకూ విరాళాలు వచ్చాయి. ఇంకా పలువురు సెలబ్రిటీలు స్పందించి విరాళాలు ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: